భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) పోస్టు విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ అంశంలో ఎటువంటి అధికారిక ఉత్తర్వు వెలువడకపోవడం కూడా గమనార్హం. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గానూ వ్యవహరించే ఈ పోస్టులో రిటైర్డ్ పోలీసు అధికారి తిరుపతి పదవీ కాలాన్ని పొడిగించి, అతన్ని అక్కడే, అదే హోదాలో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తన సర్వీసులో ఎస్ఐ నుంచి ఓఎస్డీ స్థాయి వరకు ఎదిగిన తిరుపతి సేవలను మరో మూడేళ్లపాటు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
గత నెలాఖరులోనే ఓఎస్డీ హోదాలో పదవీ విరమణ చెందిన తిరుపతి ప్రస్తుతం అనధికారికంగా అదే పోస్టులో కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన పదవీ కాలన్ని పొడిగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వు జారీ చేసే అవకాశాలున్నట్లు కూడా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. నక్సల్స్ అణచివేతలో సమర్ధునిగా పేరుగాంచిన తిరుపతి పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు తోడల్లుడు కూడా. కొందరు రిటైర్డ్ అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే.