రాజకీయాల్లో సాధ్యాసాధ్యాలకు తావు లేదని చెబుతుంటారు. సమయం, సందర్భాన్ని బట్టి… సాధ్యమయ్యేది కూడా అసాధ్యం కావచ్చు, అసాధ్యమనుకున్నది సునాయసంగా సాధ్యం కూడా కావచ్చు. ‘ప్యూర్ పాలిటిక్స్’లో వీటి సంగతి ఎలా ఉన్నప్పటికీ, రాజకీయ నేతల చేతుల్లో గల మీడియాలో ప్రత్యర్థులకు ప్రాధాన్యత లభించడమే అసలు విశేషం. ఆ మధ్య 10టీవీ న్యూస్ ఛానల్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లైవ్ ఇంటర్వ్యూ ప్రసారం కావడం ఓ సంచలనం. ఎందుకంటే 10టీవీ ‘మైహోం’ రామేశ్వర్ రావు మీడియా గ్రూపు సంస్థల్లో భాగం కాబట్టి. గంటకుపైగా సాగిన రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూకు 10టీవీ అత్యంత ప్రాధాన్యనివ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మైహోం రామేశ్వర్ రావు వ్యాపారాలపై రేవంత్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్న పరిణామాల్లో ఆయనకు చెందిన మీడియా గ్రూపులో రేవంత్ ఇంటర్వ్యూకు ఎందుకు ప్రాధాన్యనిచ్చారు? అసలేంటి కథ? అనే అంశాలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలే ఉన్నాయి.
ఇటువంటి ఘటనలు ‘బ్యాలెన్స్’ జర్నలిజానికి ప్రామాణికంగా భావించడానికి ఆస్కారమే లేదు. కనీసం స్క్రోలింగుల్లోనూ రేవంత్ రెడ్డి పేరు కనిపించని విధంగా మైహోం మీడియా గ్రూపు వ్యవహరించిన ఉదంతాలు అనేకం. అంతెందుకు…? టీఆర్ఎస్ పార్టీ కరదీపికగా భావిస్తున్న ‘నమస్తే తెలంగాణా’ పత్రికలో విపక్ష పార్టీల వార్తలకు కించిత్ స్థానం కూడా ఉండదనే వాదన ఉండనే ఉంది. విపక్షాల సంగతి దేవుడెరుగు… స్వపక్షానికి చెందిన కొందరు నాయకులకు కూడా ఈ పత్రికలో అప్పుడప్పుడు సింగిల్ కాలమ్ వార్తకు కూడా ‘స్థానం‘ దక్కదు. చివరికి హరీష్ రావు వార్తలకు సైతం ‘కత్తెర’వేసిన చరిత్రను ఈ పత్రిక ఆపాదించుకున్నట్లు ప్రచారం ఉంది. ఇప్పుడీ ఉదాహరణల చరిత్ర ఎందుకంటే…?
‘మన తెలంగాణా’ పత్రిక తెలుసుగా? ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీపీఐకి చెందిన విశాలాంధ్ర పత్రిక పేరును ఆంధప్రదేశ్ కే పరిమితం చేసి, ‘మన తెలంగాణా’పేరుతో ఆ పార్టీ తీసుకువచ్చిన పత్రిక ఇది. ఐజేయూ జాతీయ నేత కె. శ్రీనివాసరెడ్డి సంపాదకత్వంలో ప్రారంభమైన ఈ పత్రిక ‘పోకడ’పై సీఎం కేసీఆర్ కత్తి కట్టినట్లు వార్తలు వచ్చాయి. అనంతర పరిణామాల్లో ఈ పత్రిక చేతులు మారింది. పత్రిక ‘ఇంప్రింట్’లో ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్ పేర్లు రికార్డెడ్ గా ఎవరివైనప్పటికీ, కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ పత్రిక యజమానులుగా మీడియా సర్కిళ్లలో ప్రచారం ఉంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ఈ పత్రికలో భాగస్వామ్యం ఉన్నట్లు మీడియా వర్గాలు చర్చించుకుంటుంటాయి. ఈ పత్రిక విధానాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక వార్తా కథనాలు ఈ అంశాన్ని స్పష్టం చేశాయి కూడా.
ఈ నేపథ్యంలో ‘మన తెలంగాణా’ పత్రికలో ఈరోజు ప్రత్యేక విశేషం ఏమిటో తెలుసా? వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడుతున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వార్తా కథనానికి ఈ పత్రిక ప్రమఖ స్థానాన్ని కల్పించింది. మెయిన్ ఎడిషన్ మూడో పేజీలో కోదండరాం ఫొటోతో మూడు కాలాల వార్తను ప్రచురించడమే చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ‘పెయిడ్ ఆర్టికల్’ కాదుగా…? అని సందేహిస్తున్నవారూ లేకపోలేదు. అయినా ప్రొఫెసర్ సార్ పెయిడ్ ఆర్టికల్ ఎందుకు పబ్లిష్ చేయించుకుంటారు? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అబ్బే… అదేమీ లేదు ‘మన తెలంగాణా’ బ్యాలెన్సుడ్ జర్నలిజానికి ప్రతీకంగా పేర్కొంటే మాత్రం ఖచ్చితంగా అది కోదండరాం సార్ అభిమానులు ‘సంతోష’పడాల్సిన అంశమే!