ఫొటో చూశారు కదా? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ సందర్భంగా లీకయిన దృశ్యమిది. చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ‘జంగిల్ వార్ డ్రెస్’లో కనిపిస్తున్న ఈ ఫొటో లీక్ కావడంపై చిత్ర దర్శకుడు కొరటాల శివ తీవ్ర అసహనంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక స్థానిక పోలీసుల వైఫల్యం వల్లే తమ చిత్రంలోని ముఖ్య సీన్లు లీకవుతున్నాయని చిత్రయూనిట్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సినిమా సీన్ల లీక్, చిత్ర యూనిట్ ఆందోళన వంటి అంశాలను పక్కనబెడితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే మైన్స్ లో సాగుతోంది.
‘ఆచార్య’ సినిమాలో కరీంనగర్ కమాన్ ను పోలిన రణస్థలి సెట్, ధర్మపురి దివ్యక్షేత్రంలా కనిపిస్తున్న ఓ టెంపుల్ సెట్, ఆలివ్ గ్రీన్ డ్రెస్ ధరించి కత్తి పట్టుకున్న చిరంజీవి పాత్ర వంటి అనేక ప్రత్యేకాంశాలు చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు లీకయిన ఫొటో స్పష్టం చేస్తోంది. అయితే అది ఎవరి పాత్ర అనే అంశంపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఆచార్య’గా చిరంజీవి నటిస్తున్న పాత్ర పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యదా? ప్రస్తుత మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతిదా? లేక కొయ్యూరు ఎన్కౌంటర్ లో మరణించిన నల్లా ఆదిరెడ్డిదా? అనే ప్రశ్నలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
దేవాలయ భూముల ఇతివృత్తాన్ని కథగా మల్చుకుని కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. విప్లవోద్యమానికి, దేవాదాయ శాఖకు చెందిన భూములతో గల లింక్ సంగతి ఎలా ఉన్నప్పటికీ, తాజా షూటింగ్ షెడ్యూల్ మాత్రం ఓ అంశాన్ని వెల్లడిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇల్లెందులోని ఓపెన్ కాస్ట్, భూగర్భ బొగ్గు గనుల్లో షూటింగ్ నిర్వహిస్తుండడం, చిరంజీవి, రామ్ చరణ్ ‘జంగిల్ వార్ డ్రెస్’లో కనిపిస్తుండడంపై ఆసక్తికర ఊహాగానాలు సాగుతున్నాయి. బొగ్గుబావుల్లో నక్సల్స్ పాత్రలను దర్శకుడు కొరటాల శివ గనుక తెరపై చూపిస్తే అది ఖచ్చితంగా ‘సమ్మిరెడ్డి’ పాత్రగా అంచనా వేస్తున్నారు.
ఇంతకీ ఎవరీ సమ్మిరెడ్డి? అనే ప్రశ్నకు వస్తే… పీపుల్స్ వార్ ఉద్యమ ప్రస్థానంలో కీలక భూమికను పోషించిన దాని అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కీలక నేతగా పేర్కొనవచ్చు. బొగ్గుగని కార్మికుల్లో పీపుల్స్ వార్ ఉద్యమానికి గల పట్టుకు సికాస కార్యకలాపాలే ప్రధానంగా పోలీసులు ఇప్పటికీ చెబుతుంటారు. సికాస కార్యదర్శి హోదాలో ఎవరు కార్యకలాపాలు నిర్వహించినా సంస్థాగతంగా వారి పేరు ‘రమాకాంత్’గానే వ్యవహరించేవారు. అనేక ఎన్కౌంటర్లలో హుస్సేన్, కట్ల మల్లేష్ వంటి పలువురు సికాస నేతలు చనిపోయినప్పటికీ ‘రమాకాంత్’ పేరు మాత్రం సజీవంగానే ఉండేది. దీంతో అసలు రమాకాంత్ ఎవరనే విషయం నిర్ధారణ కాక పోలీసులు అప్పట్లో తలలు నిమురుకునేవారు. రమాకాంత్ పేరుతోనే సికాస కార్యకలాపాలు నిర్వహించిన మాదాటి సమ్మిరెడ్డి విప్లవోద్యమ చరిత్రలో ప్రత్యేకతను చాటుకున్నారు. మంచిర్యాల ప్రాంతంలోని నస్నూర్ ఎన్కౌంటర్ లో పోలీసులతో సమ్మిరెడ్డి ఒక్కడే గంటల తరబడి పోరాడడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. దాదాపు పదహారు గంటల హోరాహోరీ పోరులో సమ్మిరెడ్డి షెల్టర్ తీసుకున్న ఇంటిని ఎంతో ప్రయాసకోర్చి పోలీసులు ఆధీనంలోి తీసుకుంటే తప్ప ఎన్కౌంటర్ ఫలితం లభించలేదు.
ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ పాత్రను రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమాలో పోషిస్తున్నారా? ఈ చిత్రంలో చిరంజీవి తనయుని కీలక పాత్ర ఇదేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నక్సల్స్, బొగ్గుబావులు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ‘సికాస’ కార్యకలాపాలు, సమ్మిరెడ్డి నిర్వహించిన కీలక భూమిక తప్పకుండా స్ఫురణకు వస్తుందని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు చెబుతుంటారు. అయితే ఇల్లెందు బొగ్గుబావుల్లో ‘జంగిల్ వార్ డ్రెస్’లో గల చిరంజీవి, రామ్ చరణ్ లతో ప్రస్తుతం ఫైట్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… బొగ్గుబావుల్లో బాలకార్మికులతో పని చేయిస్తున్న కొందరు దుండగులను చిరంజీవి, రామ్ చరణ్ పాత్రలు చితకబాదే సీన్లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే అసలు బొగ్గుబావుల్లో బాలకార్మికులు ఎందుకు ఉంటారు? అనేది మరో ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో బాలకార్మికుల జాడ కూడా ఉండే అవకాశమే లేదు.
ఈ నేపథ్యంలో కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాకోసం రాసుకున్న అసలు కథ ఏమిటి? పూర్తిగా విప్లవోద్యమ నేపథ్యమేనా? దేవాలయ భూముల పరిరక్షణతో గల అంశమేమిటి? ఆలివ్ గ్రీన్, జంగిల్ వార్ డ్రెస్సుల పాత్రల స్వభావం, స్వరూపాలేమిటి? విప్లవోద్యమం అనే పాయింట్ ను తీసుకుని పక్కా కమర్షియల్ వాల్యూస్ తో సినిమా సీన్లను రాసుకున్నారా? ఇదే నిజమైతే బొగ్గుబావుల్లో బాలకార్మికుల ప్రస్తావన కిచిడీ కథగా మారనుందా? వంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చిరంజీవి, రామ్ చరణ్ ధరించిన ‘జంగిల్ వార్ డ్రెస్’ల ఫొటో మాత్రం వైరల్ గా మారడం విశేషం.