‘కమ్మ’ సామాజికవర్గ సమ్మేళనానికి నామా, తుమ్మల నాగేశ్వర్ రావులు దూరం!
ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో ఇది తాజా వివాదం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘కమ్మ’ సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉండడం రాజకీయ దుమారానికి దారి తీయడమే కాదు, తీవ్ర చర్చనీయాంశంగానూ మారింది. ఇతర పార్టీలకు చెందిన కొందరు ‘కమ్మ’ నాయకులు సైతం హాజరైనట్లు తెలుస్తున్న ఈ సమ్మేళనంలో ముఖ్యంగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కనిపించకపోవడం, వారిద్దరికీ ఎటువంటి ఆహ్వానం లేకపోవడం కలకలానికి దారి తీసింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ నేతలు కులాల వారీగా సామాజిక సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ మహానగరంలో ఆదివారం ‘వెలమ’ సామాజికవర్గ సమ్మేళనాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహించారు. ఇదే తరహాలో వివిధ జిల్లాల్లో కులాలవారీగా సమ్మేళనాలు నిర్వహించి అధికార పార్టీ అభ్యర్థుల విజయానికి గులాబీ పార్టీ నేతలు పాటుపడుతున్నారు. తమ సామాజికవర్గం బలంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ‘కమ్మ’ సామాజికవర్గ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియను ‘మంత్రిగారి భోజనాలు’ పేరుతో నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం నగరంలోని గొరిల్లా పార్క్ లోని ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఉదయం వరకు ఖమ్మం నగరంలోనే గల ఎంపీ నామా నాగేశ్వరరావు అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ‘కమ్మ’ సామాజికవర్గ సమ్మేళనానికి ఎంపీకి ఎటువంటి ఆహ్వానం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన అకస్మాత్తుగా రాజధానికి వెళ్లారు. వరుసగా నాలుగు రోజులపాటు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న ‘నామా’ ఆదివారం ఉదయం ఉన్నఫళంగా హైదరాబాద్ వెళ్లడం, తిరిగి సోమవారం మళ్లీ ఖమ్మానికి వస్తుండడం గమనార్హం. కాగా శనివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన ‘వెలమ’ సామాజికవర్గ సమ్మేళనానికి కూడా స్థానిక ఎంపీ హోాదాలో ‘నామా’కు ఆహ్వానం అందిందని, మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్న ఈ కార్యక్రమానికి కూడా హాజరయ్యారని ఎంపీ అనుచరులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తమ నేతకు ఎటువంటి ఆహ్వానం లేదని, ఇది అత్యంత విచారకరమని నామా వర్గీయులు స్పష్టీకరిస్తున్నారు.
ఇదే దశలో ఈ సమ్మేళనానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కూడా ఎటువంటి ఆహ్వానం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. చివరికి కమ్మ సంఘం జిల్లా నాయకుడు వేజెళ్ల సురేష్ వంటి ప్రముఖులు కూడా ఈ సమ్మేళానికి దూరంగా ఉండడం చర్చకు దారి తీసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి కలిసికట్టుగా కష్టపడాలని సీఎం కేసీఆర్ అభిలషిస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వర్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు వంటి ముఖ్య ‘కమ్మ’సామాజికవర్గ నేతలు ఈ సమ్మేళనానికి దూరంగా ఉండడంపై సహజమైన అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం టీఆర్ఎస్ అభ్యర్థి ‘పల్లా’ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.