సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి వివాదంలో చిక్కుకున్నారా? తాజా వివాదాస్పద అంశంలో ఆయన పాత్ర ఎంత? అనే అంశంపై జర్నలిస్టు సర్కిళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాదారహితునిగా పేరుగల రామచంద్రమూర్తి తొలిసారి ఓ ఘటనలో వివాదాస్పదమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దరిమిలా ఓ జర్నలిస్ట్ రోడ్డున పడాల్సి వచ్చిందనేది ఆయా ప్రచారపు అసలు సారాంశం.
కొద్ది నెలల క్రితం ఆంధప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన రామచంద్రమూర్తికి జర్నలిస్టు సర్కిళ్లలో మంచి పేరుంది. మృదు స్వభావిగా, వివాదారహితునిగా ప్రాచుర్యం ఉంది. కేఆర్ మూర్తిగా ఎందరో జర్నలిస్టులు ఆయనను అభిమానంతో పిల్చుకుంటుంటారు. జర్నలిజంలో ఆయనను ఆదర్శంగానూ తీసుకుంటారు. తెలుగు మీడియాలో తనదైన వ్యక్తిత్వం గల రామచంద్రమూర్తి ఓ సాధారణ జర్నలిస్టు కోసం వివాదాస్పదమయ్యారా? అనేదే తాజాగా జరుగుతున్న చర్చ.
అసలు విషయంలోకి వెడితే… ఖమ్మం జిల్లాలో మాటేటి వేణుగోపాల్ అనే ఓ జర్నలిస్టు ఉన్నారు. ‘వార్త’ దినపత్రికలో సత్తుపల్లి ఆర్సీ ఇంచార్జిగా గతంలో పనిచేసిన వేణుకు రామచంద్రమూర్తితో అక్కడే విడదీయరాని అనుబంధం ఏర్పడిందని చెబుతుంటారు. వార్తలో ఎడిటర్ గా పనిచేస్తున్న రామచంద్రమూర్తి అక్కడి నుంచి ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వెళ్లిన సందర్భంలో మాటేటి వేణు కూడా అదే పత్రికలో చేరారు. మచిలీపట్నంలో స్టాఫ్ రిపోర్టర్ గా నియమితుడై పనిచేశారు. ఆంధ్రజ్యోతి నుంచి తప్పుకుని హెచ్ఎంటీవీ ఎడిటర్ గా రామచంద్రమూర్తి వెళ్లిన సందర్భంగానూ వేణు అదే టీవీకి ఖమ్మం రిపోర్టర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి ‘సాక్షి’ దినపత్రికలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించాక వేణు కూడా అదే పత్రికలో ఖమ్మం బ్యూరో ఇంచార్జిగా నియమితులయ్యారు. రామచంద్రమూర్తి, వేణుల మధ్య గల విడదీయలేని అనుబంధానికి ఆయా ఉదంతాలను జర్నలిస్టు సర్కిళ్లు ఉదహరిస్తుంటాయి.
ఓ జర్నలిస్టుకు, ఎడిటర్ స్థాయి వ్యక్తికి మధ్య ఇటువంటి అనుబంధం కొనసాగడంలో తప్పు లేకపోవచ్చు. ఇదే దశలో అది వృత్తిపరమైన బంధమా? సామాజిక అనుబంధమా? అనే ప్రశ్నలు కూడా అనవసరం. కానీ అనూహ్యంగా ఓ జర్నలిస్ట్ రోడ్డున పడడానికి వీరిద్దరి మధ్య గల అనుబంధమే కారణమనే ప్రచారం జరగడం, అది పాత్రికేయవర్గాల్లో చర్చనీయాంశంగా మారడమే విశేషం. ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా చేసిన కొద్ది నెలల అనంతరం ఖమ్మంలో ‘సాక్షి’ బ్యూరో ఇంచార్జిగా పనిచేస్తున్న మాటేటి వేణుకు ఇటీవలే స్థానచలనం కలగడం గమనార్హం. ఖమ్మం నుంచి వేణును అనంతపూర్ కు బదిలీ చేస్తూ సాక్షి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. రిపోర్టింగ్ విభాగంలో గల వేణును డెస్క్ లోకి మారుస్తూ సబ్ ఎడిటర్ గా నియమించింది. అయితే వేణు అనంతపూర్ కు వెళ్లకుండా అకస్మాత్తుగా ‘నమస్తే తెలంగాణా’ ఖమ్మం బ్యూరో ఇంచార్జిగా తాజాగా నియమితులయ్యారు.
జర్నలిస్ట్ సంస్థలు మారడంలోనూ వింతేమీ లేదు. కానీ కేవలం అయిదు నెలల క్రితం ‘నమస్తే తెలంగాణా’ ఖమ్మం బ్యూరో ఇంచార్జిగా నియమితుడై బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణ అనే మరో జర్నలిస్టు వేణు నియామకంతో రోడ్డున పడడమే విషాదంగా జర్నలిస్టు సర్కిళ్లు అభివర్ణిస్తున్నాయి. వాస్తవానికి రామకృష్ణ అంతకు ముందు అదే పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పత్రిక యాజమాన్యమే అతన్ని డెస్కు నుంచి రిపోర్టింగ్ విభాగంలో బ్యూరో ఇంచార్జిగా నియమించింది. పట్టుమని అయిదు నెలలు కూడా గడవకముందే అకస్మాత్తుగా రామకృష్ణ స్థానంలో వేణు నియామకం వెనుక సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి సిఫారసు ఉందనే ప్రచారం జర్నలిస్టు సర్కిళ్లలో సాగుతోంది. తన ‘టాలెంట్’ ద్వారానే వేణు తాజా ఉద్యోగం సంపాదించుకుని ఉండొచ్చు. కానీ రామచంద్రమూర్తితో అతనికి గల అనుబంధం, గత నియామకాలు వివాదాస్పద ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. రామచంద్రమూర్తి సిఫారసు వల్లే వేణు నమస్తే తెలంగాణాలో నియమితులయ్యారని, ఫలితంగా బీసీ వర్గానికి చెందిన ఇంకో జర్నలిస్టు రోడ్డున పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన నేపథ్యంలోనే రామచంద్రమూర్తి తొలిసారి వివాదాస్పదమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా..,
ఇదే అంశంపై రామచంద్రమూర్తిని ts29 సంప్రదించగా, రామకృష్ణ అనే బ్యూరో ఇంచార్జ్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. వేణు నియామకంలో తన పాత్రేమీ లేదని, నమస్తే తెలంగాణా పత్రిక యాజమాన్యాన్ని అడుక్కుని వేణు ఉద్యోగం సంపాదించుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకపు ఉదంతంతో తనకు ఏ రకంగానూ సంబంధం లేదని రామచంద్రమూర్తి స్పష్టం చేశారు.