తెలంగాణా సీఎం పీఆర్వో పదవికి గటిక విజయ్ కుమార్ అనే వ్యక్తి రాజీనామాకు దారి తీసిన పరిస్థితులేమిటి? విజయ్ రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే ఉన్నాయా? వ్వవస్థీకృత అంశాలేవైనా దాగి ఉన్నాయా? విజయ్ కుమార్ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించినట్లు వ్యక్తిగత కారణాలే ఆయన రాజీనామాకు దారి తీస్తే ఎటువంటి సమస్యా లేకపోవచ్చు. కానీ వ్వవస్థీకృత అంశాలతో అతని రాజీనామా ముడిపడి ఉంటేనే అనేక ప్రశ్నలు తలెత్తుతాయనేది పరిశీలకుల భావన.
అసలు విషయంలోకి వెడితే… గటిక విజయ్ కుమార్ అనే సాధారణ జర్నలిస్టు నేరుగా సీఎం పీఆర్వోగా నియామకం కావడమే అప్పట్లో ఆశ్చర్యకర పరిణామంగా పలువురు అభివర్ణిస్తుంటారు. విజయ్ కుమార్ తొలుత ప్రయివేట్ పీఆర్వో మాత్రమే. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు ఆయన ట్రాన్స్ కో సంస్థలో జనరల్ మేనేజర్ (కమ్యునికేషన్స్)గా ఎంపికయ్యారు. ఈ సంస్థలో డైరెక్టుగా జీఎం స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా విజయ్ ని ప్రభుత్వం ఎంపిక చేసిన తీరుతెన్నులపైనా, ఈ సందర్భంగా ఇచ్చిన నోటిఫికేషన్ పైనా అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అంటే నిన్నటి రాజీనామా అంశం వెలుగులోకి రాకముందు సైతం విజయ్ సీఎం ప్రయివేట్ పీఆర్వో కాదు. ప్రభుత్వ ఉద్యోగంలో గల ‘అధికార’ పీఆర్వో. సాంకేతికంగా డెప్యుటేషన్ పై పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.
కానీ నిన్న విజయ్ కుమార్ తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించిన అంశమేంటి? తన వ్యక్తగత కారణాల వల్ల సీఎం పీఆర్వోగా రాజీనామా చేశానని ప్రకటించారు. కానీ ట్రాన్స్ కో సంస్థ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో పీఆర్వోగా రాజీనామా అనేది అసలు ప్రశ్నే కాకపోవచ్చు. సీఎం పీఆర్వో హోదాకు రాజీనామా అనే అంశంలో లాజిక్ లేదనేది కొందరి వాదన, లాజిక్కే కాదు క్రెడిబిలిటీపైనా సందేహాలు ఉన్నాయంటున్నారు. అందువల్ల విజయ్ కుమార్ రాజీనామా వ్యవహారంలో వ్వవస్థీకృత అంశాలేవైనా ముడిపడి ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు (సీఎంవో) ఎందుకు మౌనం వహిస్తున్నాయనేది ఇంకో ప్రశ్న.
ప్రచారంలో గల వార్తల ప్రకారం… విజయ్ కుమార్ రాజీనామాకు దారి తీసిన పరిస్థితుల, పరిణామాల వెనుక బలీయమైన కారణాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇదేగనుక నిజమైతే ఆయన రాజీనామా వెనుక వ్వవస్థీకృత కారణాలు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అది నైతిక పొరపాటా? ఆర్థిక పొరపాటా? రాజకీయ తప్పదమా? ఇవీ ప్రశ్నలు. ఇందులో ఏ పొరపాటు ఉన్నప్పటికీ అది క్షమార్హమా? శిక్షార్హమా? అనే సంశయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే విజయ్ రాజీనామా చేస్తే తనకోసమే క్రియేట్ చేసిన ట్రాన్స్ కో జీఎం ఉద్యోగంలో విజయ్ కొనసాగేవారు. కానీ ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించారనే వార్తలు వచ్చాయి. ట్రాన్స్ కో జీఎం ఉద్యోగానికి కూడా రాజీనామా చేశానని విజయ్ ఓ పత్రికకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పీఆర్వో విధుల నుంచి తప్పించి డెప్యుటేషన్ ను రద్దు చేశారంటే ఓ అర్థముంటుంది. కానీ పాలకులు ఇష్టపడి ఇచ్చిన ప్రభుత్వ కొలువు నుంచి కూడా సాగనంపారంటే సహజంగానే అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే ఇప్పుడు మీడియా వర్గాల్లోనేగాక, రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రధాన చర్చ.
విజయ్ రాజీనామా వెనుక గనుక వ్వవస్థీకృత అంశాలు, ఆరోపణలు ముడిపడి ఉంటే మాత్రం ఇది అతని ఒక్కడితోనే సమసిపోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వ్వవస్థీకృత తప్పిదాలు, ఆరోపణలు నిజమైతే అవి నైతిక తప్పిదమా? ఆర్థిక తప్పిదాలా? రాజకీయ తప్పిదమా? అనే ప్రశ్నలపైనా భిన్న చర్చ జరుగుతోంది. ఒక్కో తప్పిదానికి ఒక్కో వ్యవహారం ముడి పడి ఉంటుంది. వాస్తవానికి విజయ్ విషయంలో ఒక్క శిరచ్ఛేదం తప్ప, మిగతా అన్ని క్రియలూ పూర్తయే విధంగా ఆయన హోదాలకు రాజీనామా పర్వం సాగిందంటున్నారు. ఇందులో నైతిక తప్పిదముంటే అందుకు బాధ్యులెవరు? ఆర్థిక పొరపాట్లు ఉంటే అవి ఇంకా ఎవరెవరిని చుట్టముట్టనున్నాయి? అనే అంశాలపైనా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇవేవీ కావని, రాజకీయ తప్పిదమే విజయ్ ను సాగనంపడానికి ప్రధానంగా దారితీస్తే… అది ఎవరి రాజకీయ ఉనికికి ప్రశ్నించే విధంగా తయారైందనేది మరో ప్రశ్న.
వాస్తవానికి గటిక విజయ్ కుమార్ సీఎంకేసీఆర్ కు చీఫ్ పీఆర్వో కూడా కాదు. సీఎంవోలో గల నలుగురు పీఆర్వోల్లో తానూ ఒకడు. కానీ బాహ్యప్రపంచంలో, ముఖ్యంగా సామాన్య జనంలో మాత్రం సీఎం పీఆర్వో వ్యవహారాల్లో కళ్లూ, చెవులూ, ముక్కూ… సర్వం తానే అయినట్లుగా అతను వ్యవహిరించారనడంలో ఏ సందేహం లేదు. విజయ్ కుమార్ కు ఇంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత లభించడానికి గల కారణాలపై లోతైన విశ్లేషణ కూడా అవసరం లేని బహిరంగ రహస్యం. అందువల్ల పీఆర్వో పదవికి విజయ్ కుమార్ రాజీనామా అంశం ప్రజాప్రయోజన అంశం కూడా కాదు. ‘పిచ్చుక’మీద బ్రహ్మాస్త్రం తరహాలో విజయ్ రాజీనామా వెనుక గల కారణాలపై ఆరోపణలతో కూడా ప్రచారం జరగడమే గమనించాల్సిన అంశం. ఈ నేపథ్యంలో విజయ్ రాజీనామా వ్యక్తిగతమా? వ్వవస్థీకృతమా? అనే ప్రశ్నలకు అధికారిక సమాధానం లభిస్తుందని ఆశించడంలో తప్పు కూడా లేకపోవచ్చు.