ఫ్లాష్ బ్యాక్:
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, ఉత్తర తెలంగాణాలోని ఏదో జిల్లాలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. సభకు హాజరైన అశేష జనం ఆయన ప్రసంగానికి ముగ్ధులై ఈలలు వేస్తూ, చప్పట్లతో కేరింతలు కొడుతున్నారు. తన ప్రసంగాన్ని క్షణంపాటు ఆపిన సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా విజయ్ కుమార్…? అని పిలిచారు. ‘నేను పీఆర్వో విజయ్ కుమార్ కు చెబుతాను. అందుకు సంబంధించిన ప్రొగ్రెస్ గురించి విజయ్ మీకు చెబుతారు’ అని కేసీఆర్ సభాముఖంగా ఓ వ్యక్తిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా సభలోని ప్రజలేకాదు, వేదిక మీద గల నాయకులు, సీఎం సభను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వారు కూడా ఆశ్చర్యపోయారు. సీఎం హోదాలో గల కేసీఆర్ వంటి నాయకుడు తన పీఆర్వో గురించి సభాముఖంగా ప్రకటించి పరిచయం చేసిన దృశ్యం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం. ఎందుకంటే తమ పీఆర్వోల గురించి గతంలో ఏ సీఎంలు కూడా సభాముఖంగా ప్రజలకు వేదికపైనే పరిచయం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడీ ‘ఫ్లాష్ బ్యాక్’ ప్రస్తావన దేనికంటే…?
అతనే గటిక విజయ్ కుమార్. సీఎం కేసీఆర్ సభా వేదికపై పరిచయం చేసిన తన పీఆర్వో. వాస్తవానికి సీఎం పీఆర్వోలు చాలా మంది ఉన్నారు. వీరందరికీ నాయకత్వం వహించే చీఫ్ పీఆర్వో కూడా ఉన్నారు. కానీ వారెవరికీ దక్కని ప్రాధాన్యత, ప్రాముఖ్యత పీఆర్వో విజయ్ కుమార్ కే దక్కింది. కేసీఆర్ తల్లో నాలుకలా ప్రాబల్యం సంపాదించుకున్న గటిక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారనే వార్త తెలంగాణా వ్యాప్తంగా ఓ సంచలనం. తన వ్యక్తిగత కారణాల వల్ల సీఎం పీఆర్వో పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయ్ కుమార్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. పీఆర్వో పదవి నుంచి విజయ్ కుమార్ అకస్మాత్తు ‘నిష్క్రమణ’పై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. సీఎంవోలో విజయ్ కుమార్ గడచిన ఆరేళ్ల కాలంలో తిరుగులేని ఆధిపత్యం సాధించారనేది ఆయా వార్తల సారాంశం. తనకు లభించిన పట్టు ద్వారా అనేక అవినీతి, అక్రమ కార్యకలాపాలు చేశాడని, అందువల్లే సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారనే వార్తలు వివిధ రకాల మీడియాల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి.
తన పీఆర్వో విభాగంలో ఏరికోరి ఎంచుకుని ప్రముఖ స్థానం కల్పించిన విజయ్ కుమార్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గల అసలు కారణాలేమిటి? తనకు విధేయులుగా ఉండే వారు చిన్న చిన్న పొరపాట్లు చేసినా క్షమించే ఉదారవాద గుణం ఉన్నట్లు ప్రచారం గల సీఎం కేసీఆర్ కు విజయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో కోపం కలగడానికి దారి తీసిన పరిణామాలేమిటి? ఇవీ చర్చనీయాంశాలుగా మారిన ప్రశ్నలు. విజయ్ కుమార్ రాజీనామా గురించి సీఎంవో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేసిన దాఖలా కూడా లేదు. నిజంగా వ్యక్తిగత కారణాలవల్లే పీఆర్వో పదవికి విజయ్ రాజీనామా చేసినట్లయితే తన కోసమే కేసీఆర్ ప్రభుత్వం క్రియేట్ చేసిన ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ (కమ్యునికేషన్స్) ఉద్యోగంలోనైనా కొనసాగాలి. దాదాపు రూ. లక్ష వేతనం గల ఈ ఉద్యోగానికి కూడా విజయ్ కుమార్ రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని విజయ్ అధికారికంగా ప్రకటించలేదు. అలాగని విజయ్ రాజీనామా పరిణామాలపై సీఎంవో కూడా అధికారికంగా స్పందించలేదు.
ఈ నేపథ్యంలోనే పీఆర్వో విజయ్ రాజీనామాపై రకరకాల ప్రచారంతో కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ట్రాన్సకో లో రూ. 25 కోట్ల కుంభకోణం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 కోట్ల విలువైన ఇసుక రీచ్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిందని, రాజధాని నగరంలో 20 మంది సీఐలకు పోస్టింగులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని, రియల్ ఎస్టేట్ దందాల్లో తల దూర్చారని, హైదరాబాద్ లో రూ. 100 కోట్ల విలువైన భూ కుంభకోణాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు కనుగొన్నారని, ఇందులోనూ విజయ్ కుమార్ భాగస్వామిగా ఉన్నారని… ఇలా రకరకాల ప్రచారంతో కూడా వార్తా కథనాలు భిన్న రూపాయల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేగాక విజయ్ కుమార్ అవినీతి, అక్రమాలపై ఏకంగా ఏసీబీ నివేదిక ఇచ్చిందని, ట్రాన్స్ కోలోని ఓ డైరెక్టర్ రూ. 25 కోట్ల కుంభకోణంపై ఏకంగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రులను, ఎమ్మెల్యేలను శాసించే స్థాయిలో విజయ్ కుమార్ ప్రవర్తించాడని, చివరికి సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను, కూతురు కవితను కూడా పట్టించుకోని విధంగా విజయ్ వ్యవహారం ముదిరిందనే సారాంశంతో వార్తా కథనాలు వస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్ లు లీక్ అంశంపైనా భిన్నవాదన వినిపిస్తోంది. ఆయా ఆరోపణల్లో, వార్తల్లో వాస్తవం ఉందో, లేదో తెలియదుగాని, జరుగుతున్న ప్రచారంపై, వస్తున్న వార్తా కథనాలపై అధికారికంగా మాత్రం ఏ స్పందనా లేకపోవడమే ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
సీఎంవోను లక్ష్యంగా చేసుకుని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారంపై అధికారికంగా సమాచారమో, వివరణో లేకుంటే భిన్నాభిప్రాయాలకు అవకాశముందనే వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఇంతకీ విజయ్ కుమార్ ను తొలగించారా? ఆరోపణలపై సీఎం కేసీఆరే స్వయంగా విజయ్ నుంచి రాజీనామాను కోరారా? ఇదే నిజమైతే అందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? వంటి అంశాలపై అధికారికంగా వెల్లడించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పీఆర్వో విజయ్ కుమార్ రాజీనామాపై జరుగుతున్న ప్రచారానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టకుంటే, అతనిపై వివిధ రకాల ఆరోపణలతో వస్తున్న వార్తా కథనాల ప్రభావం సీఎంవో కార్యాలయంపై పడే అవకాశం లేకపోలేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.