నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ నిఘా వర్గాలు సర్వే నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణానంతరం ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలైన స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు సర్వే నిర్వహణలో తలమునకలయ్యాయి. ఉప ఎన్నిక జరిగితే గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయనే అంశం ప్రామాణికంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. తెలంగాణాలోని పలు జిల్లాలకు చెందిన స్పెషల్ బ్రాంచ్, స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన దాదాపు 25 మంది సిబ్బంది మూడు రోజులపాటు నిర్వహించిన సర్వే నిన్నటితో ముగిసింది.
కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి, బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ లతోపాటు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పేర్లను ఆధారంగా చేసుకుని ఎస్బీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే నిర్వహించారు. రెడ్డి, యాదవ్ సామాజిక వర్గాల ప్రాబల్యానికి అనుగుణంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం ఉండే అవకాశమున్నట్లు ఆయా విభాగాల సర్వేలో తేలినట్లు సమాచారం. తమతోపాటు ‘పీపుల్స్ పల్స్’ అనే సంస్థ కూడా సర్వే నిర్వహించినట్లు ప్రభుత్వ నిఘా విభాగానికి చెందిన ఒకరు చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకర సారాంశం వెల్లడైందని ఆయన పేర్కొనడం గమనార్హం. అభ్యర్థుల ఎంపిక, ఎన్నిక జరిగే తేదీనాటి రాజకీయ పరిణామాల ఆధారంగా తమ సర్వే సారాంశంలో మార్పు ఉండే అవకాశం లేకపోలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.