టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూర్యాపేట జిల్లా కోదాడలో అనూహ్య షాక్ తగిలింది. సొంత పార్టీ నేతల నుంచే ఎదురైన ఈ చేదు అనుభవంతో వేదికపైనే గల పల్లా నిర్ఘాంతపోవలసి వచ్చింది. విషయంలోకి వెడితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలోని వేమూరి ఫంక్షన్ హాల్లో ప్రచార సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గంలోని మండలాల బాధ్యులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పలువురు హాజరయ్యారు.
సమావేశంలో చిలుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వట్టికూటి నాగయ్య మాట్లాడుతూ సభా వేదికపైనే గల పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిలదీశారు. ‘ఆరేండ్ల కింద పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత ఎవర్నీ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా మాట ఇచ్చి ఓటర్లను మేం మోసం చేయలేం’ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పూర్తి బాధ్యతలను నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తీసుకుంటే తప్ప. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసేది లేదన్నారు. వట్టికూటి నాగయ్య హాట్ కామెంట్లకు స్పందనగా పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేయడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ కీలక నేతలు వేదికపైనే ఉండడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దిగువన మీరూ చూడవచ్చు.