పత్రికలకూ పాలసీలు ఉంటాయ్…. అని చెప్పుకుంటుంటాయ్ వాటి యాజమాన్యాలు. నిజమే కావచ్చు. కానీ పాలసీల రూపంలో అంతర్లీనంగా దాగి ఉన్న వాటి భావాలు, లక్ష్యాలు ఒక్కోసారి అన్యాపదేశంగా వార్తల రూపంలో బహిర్గతమవుతుంటాయ్. కొన్ని పత్రికలకు ‘రంగులు’ అంటే చాలా ఇష్టం. ప్రచారంలో గల వార్తల ప్రకారం ‘యెల్లో మీడియా’గా ప్రాచుర్యం పొందిన పత్రికలకు ‘పసుపు’ కలర్ అంటే మక్కువ కావచ్చు. జగన్ మీడియాగా ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ అభివర్ణించే పత్రికకు ‘బ్లూ’ కలర్ అంటే ప్రీతి కావచ్చు. వామపక్ష పార్టీల అనుబంధ పత్రికలకు సహజంగానే ‘ఎరుపు’ రంగు ఇష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడీ పత్రికల ‘రంగు’ల ఇష్టాయిష్టాల ప్రస్తావన దేనికంటే…?
అత్యధిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికెట్ గల తెలుగు దినపత్రిక ‘ఈనాడు’ రంగుల మక్కువలో తన ఇష్టాన్ని, అభీష్టాన్ని ప్రాంతాలవారీగా, రాష్ట్రాలవారీగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అదేమిటీ..? ఈనాడుకు చంద్రబాబునాయుడి పార్టీ రంగు అంటే ఇష్టమని చాలా మంది చెబుతుంటారు కదా? ‘యెల్లో మీడియా’గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తుంటారు కదా? అని ప్రశ్నించకండి. ఇప్పటికీ చంద్రబాబు పార్టీ రంగు అంటే ఈనాడుకు మహాప్రీతిగానే చెబుతుంటారు. అందులో ఏ సందేహం లేకపోవచ్చు. కానీ ప్రాబల్యం లేని, ఉనికి కూడా ప్రశ్నార్థకమైన చోట అదే పార్టీ రంగును పట్టుకుని ఇష్టపడితే ఫాయిదా ఏముంటుంది? అందుకే కాబోలు ఇప్పుడు ‘రంగు’లను ఇష్టపడడంలో ఈనాడు తన అభిప్రాయాన్ని తెలంగాణా వరకు మార్చుకున్నట్లుంది. శుక్రవారం కొన్ని ఎడిషన్ల వరకు మాత్రమే ప్రచురించిన ఓ ఫొటో వార్తలోని వాక్యాలు, వ్యాఖ్యల ద్వారా ఈనాడు తనకు ఇష్టమైన ‘రంగు’ను యథాలాపంగానే వెల్లడించడం విశేషంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఖమ్మం నగరంలో మార్చి 1వ తేదీ నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్న కొత్త బస్ స్టేషన్ గురించి ఓ ఫొటో వార్తా కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ‘గులాబీ’ బస్టాండ్ శీర్షికతో ప్రచురించిన పది లైన్ల వార్తా కథనంలో ‘గులాబీ రంగు రేకులతో నిర్మించిన బస్టాండ్ పైకప్పు శోభాయమానంగా కనిపిస్తోంది’ అని ముగించడం గమనార్హం. ప్రజల సొమ్ముతో నిర్మించిన బస్ స్టేషన్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా రంగు గల రేకులతో నిర్మించడంపై విపక్ష పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈనాడుకు గులాబీ రంగు ‘శోభాయమానం’గా కనిపించడం విశేషమే కదా! గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో సంబురపడాల్సిన అంశమే కదా!!