తెలుగు మీడియాలో మరో ‘పొలిటికల్’ న్యూస్ ఛానల్ ప్రేక్షకుల ముందుకు రానుందా? ఇప్పటికే గల న్యూస్ ఛానళ్లలో అనేకం రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలుగా ప్రాచుర్యం పొందిన నేఫథ్యంలో కొత్తగా మరో న్యూస్ ఛానల్ పుట్టుకురావడం జర్నలిస్టులకు ఓ రకంగా శుభవార్తే. కరోనా తదితర పరిణామాల కారణంగా ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఉద్యోగులను పొమ్మనలేక పొగబెడుతున్న పరిస్థితుల్లో కొత్తగా ఛానల్ పుట్టుకొస్తే కొంతమంది జర్నలిస్టులకు ఉపశమనాన్ని కలిగించినట్లవుతుంది. అయితే త్వరలో ఏర్పాటు కానున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ ఛానల్ కూడా త్వరలో పురుడు పోసుకోనున్న రాజకీయ పార్టీకి అనుబంధంగానే పుట్టుకొచ్చే పరిస్థితులు ఉండడం గమనార్హం.
ఔను… తెలంగాణాలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మరో న్యూస్ ఛానల్ ఏర్పాటు కానుందనే వార్తలు జర్నలిస్టు సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పార్టీ విధానాలను, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమకంటూ ఓ వాయిస్ లాంటి న్యూస్ ఛానల్ అవసరమని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గల మీడియా సంస్థలపైనే పూర్తిగా ఆధారపడితే ఆశించిన విధంగా తమ పార్టీకి ప్రచారం లభించకపోవచ్చనే భావనను షర్మిల పార్టీని కోరుకుంటున్నవారు వ్యక్తం చేస్తున్నారట. అందువల్లే తమ పార్టీ తరపున కూడా న్యూస్ ఛానల్ ఉండాలని షర్మిల తలంపుగా చెబుతున్నారు. ఈ ఛానల్ ఏర్పాటు కోసమే సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తిని ఇటీవల షర్మిల పిలిపించుకుని మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో హెచ్ఎంటీవీ వ్యవస్థాపక ఎడిటర్ గా రామచంద్రమూర్తికి పేరున్న సంగతి తెలిసిందే.
అయితే షర్మిల పార్టీకి ‘గొంతుక’గా ఏర్పాటు చేసే ఈ ఛానల్ కు ‘వైఎస్ఆర్ టీవీ’గా నామకరణం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ‘సాక్షి’ టీవీకి గల శాటిలైట్ లైసెన్స్ స్పేస్ లోనే ఈ ఛానల్ ప్రసారాలు ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు పరిస్థితులు అనుకూలించకుంటే షర్మల భర్త అనిల్ కుమార్ కు చెందినదిగా భావిస్తున్న ‘రక్షణ’ టీవీ ద్వారా కూడా న్యూస్ ఛానల్ ప్రసారాలు ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా తమ పార్టీకి న్యూస్ ఛానల్ అవసరపు ఆవశ్యకతను షర్మిల అనివార్యంగా భావిస్తున్నట్లు సమాచారం.