వీడియో చూశారు కదా? చేతిలో గుత్ప (కర్ర) అందుకుని ఆవేశంతో పరుగెడుతున్న ఈ యువకుడు ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రతినిధి. పేరు పుసులూరి రవి. ఓ స్థల వివాదంలో తలదూర్చి, తమ ఇంట్లోకి ప్రవేశించి తనపైన, తన భర్తపైన, మరో వ్యక్తిపైన దాడి చేసి గాయపర్చాడని ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల ఏడో తేదీన కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగు చూడడం విశేషం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామానికి చెందిన వున్నం రాజ్యం (68) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… అదే గ్రామానికి చెందిన పుసులూరి రవి, పుసులూరి తిరుపతయ్య, పుసులూరి బ్రహ్మయ్యలు రాజ్యం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. ఇంట్లో గల రాజ్యాన్ని బయటకు గుంజుకుని వచ్చి బూతులు తిడుతూ దాడి చేశారు. ఈ ఘటనలో రాజ్యం చేతికి గాయాలయ్యాయి. రాజ్యాన్ని కొడుతుండగా అదే సమయంలో ఇంట్లోనే గల చంద్రశేఖర్ రావు (56) అనే వ్యక్తి అడ్డుకోగా అతన్ని కూడా కొట్టి నెట్టేయడంతో ఆయన డ్రైనేజీ కాల్వలో పడిపోయి గాయపడ్డారు. అక్కడితో ఆగకుండా ఇంటి పైఅంతస్తులో గల ఆమె భర్త వెంకయ్య (91) మీదకు వెళ్లగా ఆయన తలుపులు వేసుకున్నాడు. ఆయా వ్యక్తులు తనను, తన భర్తను చంపుతామని బెదిరించారని, గాయపడిన తాను చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి వెళ్లడంతో ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగినట్లు బాధితురాలు రాజ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. తమ ఇంట్లోకి ప్రవేశించిన ఆయా వ్యక్తులపై చర్య తీసుకోవాలని రాజ్యం పోలీసులను కోరారు. ఈమేరకు ఏబీఎన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి రవి సహా ముగ్గురు నిందితులపై క్రైం. నెం, 05/2021 ఐపీసీ 448, 294 (బి), 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనలో ప్రత్యక్ష ప్రమేయమున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసిన పుసులూరి రవి ఏబీఎన్ న్యూస్ ఛానల్ జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన అనంతరం విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు మరో న్యూస్ ఛానల్ కు చెందిన ఓ విలేకరి తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని బాహాటంగానే ప్రచారం చేసుకునే ఈ ఛానల్ ప్రతినిధి కేసు నమోదు కాకుండా చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు జరుగుతున్న ప్రచారపు సారాంశం. ఘటన పూర్వాపరాలను, వీడియోను నిశితంగా పరిశీలించిన సీపీ తఫ్సీర్ ఇక్బాల్ బాధితురాలి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయాలని నేలకొండపల్లి పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కేసు నమోదైన ప్రస్తుత ఏబీఎన్ ఛానల్ ప్రతినిధిపై గతంలోనూ నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైన రికార్డు ఉండడం గమనార్హం. అయితే అప్పట్లో ఆయన మరో సంస్థలో ఉన్నాడు.
UPDATE:
నన్ను బద్నాం చేస్తున్నారు: జర్నలిస్ట్ రవి వివరణ
కాాగా ఈ వార్తా కథనంపై ఏబీఎన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి పుసులూరి రవి స్పందించారు. ts29 ప్రచురించిన వార్తా కథనంపై రవి ఫోన్ ద్వారా వివరణ ఇస్తూ, తన తండ్రికి సంబంధించిన స్థలాన్ని ఉన్నం వెంకయ్య కుటుంబీకులు దురాక్రమించారని, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. సంబంధీకుల మీద స్ట్రెస్ పాస్ కేసు కూడా నమోదైందన్నారు. ఓ చిన్న వీడియోను ఆధారంగా చేసుకుని తనను డీమోరల్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇందుకు సంబంధించి కూడా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తనంటే గిట్టని కొందరు జర్నలిస్టులు కూడా ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని రవి వారి పేర్లను ప్రస్తావించారు. గడచిన 20 రోజులుగా ఈ విషయంలో తనపై వివిధ కోణాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని రవి చెప్పారు.
ఫొటో: బాధితురాలు రాజ్యం