ఔను… రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డికి ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ అలియాస్ అర్కే తనదైన ‘మార్కు’ రాతల ద్వారా హెచ్చరిక లాంటి అప్రమత్తతను జారీ చేశారు. ఎక్కడో రహస్యంగానో, చాటుమాటుగానో, ఇతరుల వద్దనో కాదు… ఏకంగా తన మీడియా సంస్థల ద్వారానే… ‘సాయిరెడ్డీ… అన్నీ చెబుతా… బీ రెడీ!’ అంటూ శీర్షీకరించారు. విజయసాయిరెడ్డి లీలల గురించి తనకు కొన్ని కలలు వచ్చాయని, కలల వివరాలేంటో త్వరలోనే అందరికీ తెలుస్తాయని, సాయిరెడ్డి కూడా వాటిని తెలుసుకోవడానికి సిద్దంగా ఉండాలని బహిరంగంగానే తన రాతల ద్వారా వ్యాఖ్యానించారు. ఇంతకీ విజయసాయిరెడ్డి గురించి అర్కేకు కలలు ఎందుకు వచ్చాయి? ఆ కలల్లో విజయసాయిరెడ్డి గురించి ఆర్కే తెలుసుకున్నదేమిటి? చెప్పబోయేదేమిటి? అనే ప్రశ్నలు సహజంగానే రేకెత్తుతున్నాయ్ కదూ! ఆదివారం నాటి తన ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా విజయసాయిరెడ్డి గురించి ఆర్కే ఎందుకిలా రాశారో, వాటిలోని కొన్ని ముఖ్యాంశాలను దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవండి.
‘‘ఈ నెల 9న లోటస్పాండ్ వద్ద ఉన్న తన నివాసానికి చేరుకున్న షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తానని ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రకటించారు. ఈ వార్తకు మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు కూడా షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు తెలియలేదట! షర్మిల రాజకీయ నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ రాత్రి పూట కలలు కంటారు, ఆ కలలే పొద్దున ‘ఆంధ్రజ్యోతి’లో వార్తగా వస్తాయి అని వెటకారం ఆడారు. మేడం షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తనకే తెలియదని, అలాంటప్పుడు రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వాదించారు కూడా! విజయసాయిరెడ్డికి తెలియకపోవడానికి నేను బాధ్యుణ్ని కాను కదా! విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనిఉండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది.’’ అని ఆర్కే తన కొత్తపలుకు ద్వారా పేర్కొన్నారు.
‘‘ఈ విషయం అలా ఉంచితే, పరిటాల రవీంద్రను ఎందుకు హత్య చేశారని విలేకరులు ప్రశ్నించినప్పుడు సూరి బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లలో ఆనందం చూడటానికి అని మొద్దు శీను అన్న మాటలు అప్పుడు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికై పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు హద్దు మీరి మాట్లాడుతున్నారు. జగన్ దగ్గర తన ప్రాభవం తగ్గకుండా ఉండడం కోసం విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో మీడియాపైన కూడా నోరు పారేసుకుంటున్నారు.’’ అని కూడా ఆర్కే రాసుకొచ్చారు.