నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ఇంకా నగారా మోగనే లేదు. కానీ అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మొన్నటి హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏమన్నారో గుర్తుంది కదా? బీజేపీ, కాంగ్రెసోళ్లు ‘పరాష్కం’ జేస్తాండ్లు అనే భావనతో కాబోలు ‘తొక్కి పడేస్తాం… జాగ్రత్త’ అని కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సాగర్ ఉప ఎన్నిక తరుముకొస్తున్న పరిణామాల్లో కేసీఆర్ వార్నింగ్ ఇస్తే ‘పెద్దలు జానారెడ్డి’ ఊర్కుంటారా మరి? అందుకే నిన్న మీడియా సమావేశం పెట్టి మరీ కేసీఆర్ ను ఏకి పారేశారు. కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. డిండి పాలమూరు ప్రాజెక్టులు ఎక్కడిదాక వచ్చినయని నిలదీశారు. ‘అసలు నా ఊరికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవ్!’ అని వెటకరించారు.
‘పెద్దలు జానారెడ్డి’ మిషన్ భగీరథ గురించి మరీ ఇజ్జత్ తీసే విధంగా మాట్లాడితే సీఎం కేసీఆర్ అయినా కాస్త ఓపిక పడతారేమోగాని, సంబంధిత మంత్రి ఊర్కుంటారా మరి? అందుకే కాబోలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అర్జంటుగా స్పందించారు. నిన్న జానారెడ్డి మిషన్ భగీరథ పథకంపై చేసిన ఆరోపణలకు అత్యంత వేగంగా బదులిచ్చారు. ‘హాలియా మండలం అనుముల గ్రామంలో పెద్దలు జానారెడ్డిగారి ఇంట్లో… మిషన్ భగీరథ మంచినీరు నల్లాల ద్వారా వస్తున్న దృశ్యం’ అనే కాప్షన్ తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. జానారెడ్డి ఇంట్లోకి వెళ్లకుండానే వీడియోను అత్యంత చాకచక్యంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదుగాని, నీళ్లు పట్టుకునేందుకు బిందెగాని, బకెట్ గాని లేకున్నా, ఓపెన్ చేసిన నల్లా నుంచి భగీరథ నీళ్లు ధారాళంగా కాకుండా ఆగుతూ వస్తున్న సీన్ కనిపిస్తున్నది. అంతేకాదు ఈ అంశంపై మంత్రి దయాకర్ రావు మీడియాతో మాట్లాడిన ప్రకటనను దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవండి… ఆ తర్వాత కొసమెరుపు గురించి చెప్పకుందాం.
‘‘నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామంలో పెద్దలు జానారెడ్డి గారి ఇంట్లో.. మిషన్ భగీరథ మంచినీరు నల్లా ల ద్వారా వస్తున్నప్పటికీ, రావడం లేదని మీడియాకెక్కడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు. అనుములు గ్రామానికి మిషన్ భగీరథ నీరే రావడం లేదని జానారెడ్డి అనడాన్ని ఆయన ఖండించారు. గత రెండు రోజులుగా నేషనల్ హై వే పై గ్రిడ్ పైప్ లైన్ లో బ్రేక్ డౌన్ వచ్చిందని, ఆ రిపేర్లు జరుగుతున్నందున నీటిని ఇవ్వలేకపోయామన్నారు. ఆ పనులను కూడా నిన్ననే పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. అనుముల గ్రామంలో 4 ఓవర్ హెడ్ ట్యాంకులు, 25.4 కి.మీ. ఇంట్రాపైపులైన్ ఉందన్నారు. 3,734 మంది జనాభా గల అనుముల గ్రామంలో 1,548 ఇండ్లు ఉన్నాయన్నారు. అన్ని ట్యాంకులకు, బల్క్ నీటి సరఫరా జరుగుతున్నదన్నారు. ఆ గ్రామంలోని అన్ని ఇండ్లకు మంచినీరు నల్లాల ద్వారా అందుతున్నదని చెప్పారు. ఒకటి రెండు రోజుల పాటు కేవలం బ్రేక్ డౌన్ వల్ల రాని నీటి సమాచారం పాపం జానారెడ్డి గారికి తెలియనట్లుందన్నారు. అయితే, ఆయన ఇంటికి, ఆ గ్రామానికి మిషన్ భగీరథ అధికారులు వెళ్ళి నీరు వస్తున్నట్లుగా నిర్ధారించిన వీడియోని సైతం మంత్రి మీడియాకు ప్రదర్శించారు. జానారెడ్డి రాజకీయం చేస్తున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా… అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు, బహుషా ఆయనకు తగిన సమాచారం లేకపోవడం వల్ల అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.’’
చదివారుగా… జానారెడ్డి విమర్శలకు మంత్రి దయాకర్ రావు ఇచ్చిన కౌంటర్ ఇది. అంతా బాగానే ఉందిగాని హాలియా సభలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ, హుజూర్ నగర్ సభలో కూడా అవే హామీలను ఇచ్చారని, ఏడాది గడిచినా నిధులు విదిల్చలేదనే ‘కంటెంట్’తో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మీడియా గ్రూపు ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. కాస్త వాటిపైనా మంత్రి దయాకర్ రావు క్లారిటీ ఇస్తే బాగుండేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయా సభల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో మంత్రి దయాకర్ రావు నిర్వహిస్తున్న శాఖకు చెందిన ‘పంచాయతీ’లకు సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉన్నాయ్. అదీ సంగతి.