మజ్లిస్ పార్టీ మద్దతులో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గా రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి గెలుపొందారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా తార్నాక డివిజన్ నుంచి గెలుపొందిన మోతె శ్రీలత ఎన్నికయ్యారు.
తొలుత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ఎన్నికల అధికారి శ్వేతా మహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించారు. కాగా బీజేపీ తరపున ఆ పార్టీకి చెందిన ఆర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి మేయర్, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి డిప్యూటీ మేయర్ అభ్యర్థులగా నామినేషన్ దాఖలు చేశారు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ తమ పార్టీ ఆయా పదవులకు పోటీ చేస్తుందని బీజేపీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.