‘తొక్కిపడేస్తాం… జాగ్రత్త’ అని టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణా సీఎం కేసీఆర్ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు పిడికెడు మంది లేరు, ఇటువంటి డ్రామాలు చాలా చూశాం’ అని ఆయన మండిపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ హాలియా సభలో మాట్లాడుతూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొందరు ఏవో కాగితాలను ప్రదర్శిస్తుండగా సీఎం కేసీఆర్ స్పందించారు. వారి వద్ద గల కాగితాలను తీసుకుని, సభ నుంచి వారిని బయటకు పంపాల్సిందిగా కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘ఈ డ్రామాలు చాలా చూశాం. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయ్. బీజేపీ వాళ్లు కొత్తబిచ్చగాళ్లు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. మిడిసిపాటు పడుతున్నరు. మీరు పిడికెడు మంది లేరు. మేం తల్చుకుంటే నశ్యం కూడా మిగలదు. దుమ్ము, దుమ్మయితరు. మీరూ సభ పెట్టుకోండి. మా సభలకు వచ్చి వీరంగం వేస్తే కుదరదు. ముల్లు ఎక్కువైతే పొల్లు పొల్లు అయితరు. చేతులు ముడుచుకోలేదు. ఒళ్లు దగ్గరపెట్టుకోండి. జాగ్రత్త. సహనం నశిస్తే…? దేనికైనా పద్థతి ఉంటుంది. హద్దు మీరితే ఏం చేయాలో మాకు తెలుసు. తొక్కి పడేస్తాం జాగ్రత్త. మీలాంటి రాకాసులతో చాలా మందితో కొట్లాడినం. మీరో బోకాసులు. మీరో లెక్కే కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులపైనా సభలో కేసీఆర్ విమర్శలు చేశారు. తమది వీరులపార్టీ అని, వీపు చూపదని కూడా అంతకు ముందు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.