రాజకీయ పార్టీలు వివిధ సందర్భాల్లో నిర్వహించే, సభలకు, సమావేశాలకు జనసమీకరణ చేస్తుంటారు. ఇందుకు పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతుంటారు. పార్టీ కార్యకర్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ సాధారణ జనానికి మాత్రం వివిధ రకాల్లో ‘చెల్లింపులు’ చేయనిదే సభలు, సమావేశాలు భారీ ఎత్తున జరిగే పరిస్థితి కరవైంది. ఇది బహిరంగ రహస్యమే. అనేక సందర్భాల్లో నగదు చెల్లిస్తున్న సీన్లు కూడా వెలుగు చూశాయి. దినసరి కూలీ మొత్తానికి తగ్గకుండా నగదు చెల్లిస్తే తప్ప జనం సభలకు హాజరయ్యే పరిస్థితులు లేవని ‘ఆఫ్ ది రికార్డు’గా పలువురు నాయకులు చెబుతుంటారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే…?
ఈరోజు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటనకు వెడుతున్న సంగతి తెలిసిందే. అనేక అభివృద్ధి పనులకు, ఎత్తపోతల పథకాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హాలియాలో జరిగే బహరంగ సభలో ప్రసంగించనున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ పర్యటన రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. సీఎం పర్యటన, కేసీఆర్ సార్ బహిరంగసభ అంటే జనసమీకరణ భారీగా జరగాలి కదా? ఓ గ్రామ సర్పంచ్ ఇందుకు ఏకంగా దండోరా వేయించారు. దండోరా నిర్వహించిన వ్యక్తి మైకులో ఏం చెబుతున్నారో వింటే ‘షాక్’కు గురి కావలసిందే. ఎందుకంటే సీఎం సభకు తరలి రావాలని, వచ్చేవారికి రూ. 500 ఇస్తున్నారని, బస్సు కూడా ఏర్పాటు చేశామని దండోరా వేసిన వ్యక్తి మైకులో చెల్లింపుల విషయాన్ని కుండబద్ధలు కొట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలోని దండోరా వాస్తవమేనా? కాదా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే సభకు వచ్చేవారికి ఎంతగా డబ్బు చెల్లిస్తున్నా, మరీ మైకులో చెబుతారా? అనేది ప్రశ్న. అనౌన్స్ చేస్తున్న వ్యక్తి ఏదో ‘మాలధారణ’లో ఉండడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో చేసినట్లు చెబుతున్న ఈ దండోరాకు సంబంధించిన వీడియోను దిగువన చూడండి.