ఫొటోను ఓసారి నిశితంగా చూడండి. తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన చిత్రమిది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన రోజు… అంటే నిన్నగాక, మొన్నటి ఆదివారంనాడే మెగాస్టార్ ను ఆయన ఇంటికి వెళ్లి మంత్రి ఈటెల కలిశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కళాకారులకు, నిరుద్యోగ యువతకు సినీ పరిశ్రమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి చిరంజీవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈటెల వినతికి చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు కూడా వార్తా కథనాల సారాంశం. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే…
అదేరోజు మధ్యాహ్నం జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల స్థాపనను కేసీఆర్ ప్రస్తావించారు. మీడియాను అనుమతించని ఈ సమావేశంలో కేసీఆర్ చేసినట్లు పేర్కొంటున్న అనేక వ్యాఖ్యలకు ఎటువంటి ‘విజువల్’ ఆధారం కూడా లేదు. కానీ వార్తా కథనాల్లోని సారాంశం ప్రకారం… ‘పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు.. పాట పాడినంత సులువు కాదు..’ అని కేసీఆర్ అన్నారు. అంతేకాదు రాజకీయ పార్టీని పెట్టడం, నడపడమంటే ఆషామాషీ కాదని కూడా పేర్కొన్నారు. గతంలో పార్టీ స్థాపించినవాళ్ల పరిస్థితి ఏమిటో వివరించారు. తాను టీడీపీలో ఉన్నపుడు తనతోపాటు జిల్లాలో ఇంకొకాయన కూడా ఉండేవారన్నారు. ఇద్దరికీ మొదటిసారే ఎన్నికలని, ఇద్దరం గెల్చామని, తర్వాత గిట్లనే ఒకాయన పార్టీ పెడుతున్న అంటే పోయి చేరిండన్నారు. కొత్తగ పార్టీ పెట్టినాయన, తనతోపాటు గెల్చినాయన ఇద్దరూ ఆగమైండ్రని కేసీఆర్ గుర్తు చేశారు. తాను టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు తెలంగాణలో 20 పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చినయని, తెలంగాణ సాధనసమితి అని, ప్రజారాజ్యమని, జైసమైక్యాంధ్రపార్టీ, ప్రజాపార్టీగా ఉదహరిస్తూ, ఇట్ల అనేక పార్టీలు వచ్చాయన్నారు. ‘కోదండరాం కూడా పార్టీ పెట్టిండు. కానీ, ఏమైంది? ఏమవుతున్నదో అందరికీ తెలిసిందే. చెన్నారెడ్డి ఉద్ధండ నాయకుడు. మీడియా ఏమీ లేనప్పుడే.. ఆయన పార్టీ పెట్టిండు. కానీ.. దాన్ని నడపడం సాధ్యం కాలేదు. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్, టీడీపీ మాత్రమే మనుగడలో ఉన్నయి. రాజకీయపార్టీ పెట్టుడు వరకు మంచిగనే ఉంటది.. దాన్ని నడిపించడమంటే అంత ఈజీకాదు. ఓర్పు, సహనం, నిబద్ధత.. అన్నీ ఉండాలి. అప్పుడే అది ప్రజల అభిమానం పొందగలుగుతుంది. కార్యకర్తల కృషి, నాయకత్వ నిర్ణయాలపైనే పార్టీ ఎదుగుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణాలో కొత్త పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ చేసినట్లు పేర్కొంటున్న ఆయా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇంతకీ కేసీఆర్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? ఇదీ సాగుతున్న చర్చ. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి స్థాపించనున్నట్లు ప్రచారం జరుగుతున్న పార్టీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారా? పీసీసీ అధ్యక్ష పదవి దక్కకకుంటే ఎంపీ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తారని వాడుకలో గల పార్టీ గురించి కేసీఆర్ మాట్లాడి ఉంటారా? లేక టీఆర్ఎస్ పార్టీలోనే మరో నాయకుడు పార్టీ ఏర్పాటుకు ఏదేని రంగం సిద్ధం చేసుకుంటున్నారా. ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసీఆర్ కొత్త పార్టీ గురించి టీఆర్ఎస్ సమావేశంలో ఉటంకించి ఉంటారా? ఇవీ సందేహాలు. అయితే కేసీఆర్ చేసినట్లు వార్తలుగా వచ్చిన వ్యాఖ్యలకు, షర్మిల, రేవంత్ ల రాజకీయ అడుగులకు అస్సలు పొంతన కుదరడం లేదనేది పరిశీలకుల భావన. కొత్త పార్టీ గురించి కేసీఆర్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల్లోని రెండు వాక్యాలను ఓసారి నిశితంగా పరిశీలిస్తే….‘పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు.. పాట పాడినంత సులువు కాదు..’ అని అన్నారు. తెలంగాణా వ్యవహారికంలో పాన్ డబ్బా అంటే చిన్నపాటి వ్యాపారమే.
మంత్రి ఈటెల రాజేందర్ కు పౌల్ట్రీ వ్యాపారం ఉందనేది బహిరంగమే. హేచరీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయనే ప్రచారం ఉంది. అదేవిధంగా పాట గురించి కూడా కేసీఆర్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గాయకుడనే విషయమూ తెలిసిందే. తాను ‘పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ’లో పనిచేస్తున్నట్లు రసమయి ఇటీవల వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాటలు మారిపోయాయని, కలాలు, గళాలు మౌనంగా ఉంటే క్యాన్సర్ వ్యాధికంటే ప్రమాదకరమని అన్నారు. ఇప్పుడు ప్రతీ గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ పరిధిలోనే బతకాలని, సింగరేణిలో పనిచేస్తూ ఇంకో దగ్గర పనిచేస్తా అంటే నడవదన్నారు. ప్రస్తుతం తాను ‘లిమిటెడ్’ కంపెనీలో ఉన్నట్లు భావిస్తున్నానని రసమయి అన్నారు. తాము కిరాయిదార్లం కాదని, గులాబీ జెండా ఓనర్లమని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించిన సమయంలోనూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకు శ్రుతి కలిపారు. ‘రాజేందరన్న కడుపులో ఏదీ దాచుకోడు’ అని రసమయి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉండాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయానికి విరుద్దంగా మంత్రి వ్యాఖ్యలు చేసిన సందర్భలోనే రసమయి బాలకిషన్ ‘పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ’ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇలా పలు సందర్భాల్లో ఈటెల, రసమయిలు కాస్త ముందూ, వెనుకగా ఒకరి వ్యాఖ్యలకు మరొకరు వంత పాడుతున్నట్లు కనిపిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో ‘పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు.. పాట పాడినంత సులువు కాదు..’ అని కేసీఆర్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు? తన నియోజకవర్గ కళాకారులకు సినిమాల్లో అవకాశాల కోసం, ఉపాధికోసం మాత్రమే ఈటెల రాజేందర్ మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు నమ్మొచ్చా? బీసీల నాయకత్వంపై తెలంగాణాలో జరుగుతున్న రాజకీయ సమీకరణలకు, ప్రచారానికి, కేసీఆర్ వ్యాఖ్యలకు, ఈటెల వ్యాఖ్యలకు, కదలికలకు ఏదేని సారూప్యత ఉందా? ఇవీ ప్రశ్నలు, ఇప్పుడు ఈ అంశాలపైనే భారీగా చర్చ జరుగుతోంది. కాగా తాను పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ఖండించినట్లు తాజాగా వార్తలు వస్తుండడం గమనార్హం.