అనూహ్యంగా ప్రవహించిన రక్తపు వరద నీరు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనను కలిగించింది. ఇది యుగాంత సంకేతంగా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. రక్తపు వరదకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వేలాదిగా ట్విట్టర్ లో కూడా చక్కర్లు కొట్టాయి. ఇండోనేషియాలోని సెంట్రల్ జావా పెకలోంగన్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కానీ అసలు విషయమేమిటంటే… ఇండోనేషియాలోని జెంగ్ గోట్ అనే గ్రామంలో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. గ్రామ సమీపంలోని బాతిక్ ఫ్యాక్టరీలోని పెయింట్స్ కూడా వరద నీటిలో కలిసి ప్రవహించాయి. దీంతో వరద నీరు కాస్తా ముదురు ఎరుపురంగుగా మారి గ్రామాన్ని చుట్టుముట్టి మరీ ప్రవహించింది.
ఇంకేముంది…? వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో గోలగోల. రక్తపు వరదలు యుగాంతానికి సంకేతంగా ప్రచారం జరిగింది. ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెకలొంగన్ అధికారులు స్పందించి, రక్తపు వరదల గుట్టును తేల్చారు. బాతిక్ డై కారణంగా వరద ఎరుపు రంగుగా మారిందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పెకలొంగన్ ప్రాంతం సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే రంగులకు ప్రసిద్ధి గాంచింది. బాతిక్ ఫాబ్రిక్ అనే పెయింట్ తయారీలో ఈ ఏరియా బహుళ ప్రాచుర్యం పొందింది. ఇక్కడ గల స్థానిక నదులు వేర్వేరు రంగులను సంతరించుకోవడం సహజమేనట. గత నెలలో వరదల సందర్భంలో పెకలోంగన్ కు ఉత్తర దిశగా ఉన్నటువంటి మరో గ్రామాన్ని ఆకుపచ్చ నీరు చుట్టుముట్టి ప్రవహించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల్లో కొన్నింటిని దిగువన చూడవచ్చు.