అగ్రకుల సెక్యులరిస్టు పార్టీలలో తమకు ఏ భవిష్యత్తూ లేనప్పుడు, పైగా వారి అంతరంగాల్లో కులతత్వమే ఉన్నపుడు, బీసీలు కానీ, మరే బడుగు శ్రేణి కానీ, మతతత్వం వైపు మళ్లితే ఎట్లా తప్పు పట్టగలం? ఆయా పార్టీల అగ్రనేతలు ఆలోచించవలసిన విషయం ఇది. వారే కాదు. అగ్రకుల నాయకత్వంలోని కుటుంబ, ప్రాంతీయ పార్టీలలో క్రియాశీలకంగా, అంకితభావంతో పనిచేస్తున్న వెనుకబడిన కులాల నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఎంతకాలం కంచిగరుడ సేవలు? ఆరోగ్యకరమైన, ప్రజాహితమైన రాజకీయాలు కావాలి. ఆ ఖాళీ సిద్ధంగా ఉన్నది, ఏ మతతత్వ, వారసత్వ, కుటుంబ రాజకీయ సంస్థలకూ అవసరంలేని ఖాళీ అది. భర్తీ చేసేవారుంటే వారిదే భవిష్యత్తు!
‘బీసీలు అటు చూస్తే తప్పేమిటి?’ శీర్షికన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ తన ‘సందర్భం’ కాలమ్ కింద ఈనెల 4వ తేదీన రాసిన వ్యాసంలోగల ఓ పేరాలోని భాగమిది. ఈ వ్యాసంలో ఆయన రాసిన అక్షరార్థ భావన పలుకోణాల్లో తెలంగాణాలోని భవిష్యత్ రాజకీయ దృశ్యాలను ఆవిష్కరించే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్ర రాజకీయాలను కూడా టచ్ చేస్తూ ఈ వ్యాసం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణా రాజకీయాల్లో తాజాగా ఏం జరుగుతోందనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కె. శ్రీనివాస్ రాసిన వ్యాసంలోని అసలు భావానికి అనుగుణంగా బీజేపీ తెలంగాణాలో పావులు కదుపుతున్నదా? అనే ప్రశ్నకు ఔననే విధంగా ప్రచారం సాగుతోంది. సూటిగా చెప్పాలంటే బీజేపీ తెలంగాణాలో ‘బీసీ’ అస్త్రాన్ని ప్రయోగించబోతోందనేది ఈ ప్రచారపు సారాంశం. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పలు జిల్లాకు చెందిన బీసీ నేతలను అత్యంత పకడ్బందీగా పునరేకీకరణ చేస్తున్నట్లు తాజా సమాచారం.
వ్యాప్తిలో గల ప్రచారం ప్రకారం… మునుపెన్నడూలేని రీతిలో బీజేపీ రాజకీయ పావులు కదుపుతున్నది. తాజా పరిణామాలు, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నది. తమ పార్టీకి ‘కాపు’ గాసే నేతలకోసం అన్వేషిస్తున్నది. ఇందులో భాగంగానే పలువురు ‘కాపు’ నేతలపై తీవ్రమైన వత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణాలో ‘కాపు’ సామాజికవర్గంలో గట్టి పట్టుగల ప్రముఖ పారిశ్రామికవేత్త, గాయత్రీ గ్రానైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి వంటి నేతలను ఆకర్షించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలంగాణా బీజేపీకి మరింత ‘కాపు’లారిటీకోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం వేగం పుంజుకుంది. వాస్తవానికి గాయత్రి రవి గత ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వీర, విధేయుడు. అధికార పార్టీలోని ఓ నాయకుడు అతని వ్యాపార సంస్థలపై కన్నేసి నానారకాలుగా ఇబ్బందులపాలు చేసిన పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పార్టీమారినా గాయత్రి రవికి ఫలితం దక్కలేదనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికీ గులాబీ పార్టీలోని ఓ నాయకుడు గాయత్రి రవిని, ఆయన వ్యాపారాలను టార్గెట్ చేస్తూ చిక్కులపాటు చేస్తున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. వ్యాపార సంస్థలపై కేసుల నమోదు, భారీ జరిమానాలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇటువంటి పరిణామాలను లోతుగా పరిశీలిస్తున్న బీజేపీ నాయకత్వం గాయత్రి రవి లాంటి నాయకులను ఆకర్షించే దిశగా పావులు కదుపుతోంది. అయితే ఇందుకు రవి ఆసక్తి కనబరుస్తారా? లేదా? అనేది వేరే విషయం.
అదేవిధంగా ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న ఉత్తర తెలంగాణాకు చెందిన మంత్రి కూడా ఒకరు బీజేపీ వైపు చూస్తున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. మంత్రిగా తన ‘పవర్’ను, పదవిని వదులుకుని ఆయన బీజేపీలోకి ఎందుకు వెడతారనే ప్రశ్నకూ సమాధానం ఉందంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగినా, సీఎం మార్పు జరిగినా ఆయన మంత్రి పదవి ఉంటుందో, ఊడుతుందో తెలియని అయోమయ స్థితిని ఎదుర్కుంటుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు కూడా బీజేపీ ‘కాపు’లారిటీ వత్తిడికి తలొగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇవి ఉదాహరణలు మాత్రమేనట. మొత్తంగా తెలంగాణాలోని ఉమ్మడి జిల్లాల వారీగా మాంచి ‘కాపు’లారిటీ గల నాయకుల కోసం బీజేపీ తీవ్రంగా అన్వేషిస్తోంది. వ్యాపారాలు, ఇతరత్రా వ్యవస్థలు గల నాయకులు వాస్తవికంగా బీజేపీకి ‘కాపు’ కాస్తే గులాబీ పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్లపైనా క్లారిటీ ఉందంటున్నారు. కేంద్రంలో అధికారంలో గల పార్టీలో చేరిన నాయకుల జోలికి ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి వత్తిళ్లు అనే మాట ‘జోక్’గానే అభివర్ణిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లివచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ఇందుకు ఉదహరిస్తున్నారు.
మరోవైపు గులాబీ జెండా ఓనర్ గా ప్రకటించుకున్న బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వ విధానపరమైన అంశాలను సుతిమెత్తగా సృశిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తాాజా అంశంగా స్వీకరించి వేడి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే దశలో కేటీఆర్ కు బదులు ఈటెల రాజేందర్ ను సీఎం చేయాలని విపక్ష పార్టీలకు చెందిన నేతలు సరికొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. కాబోయే పీసీసీ చీఫ్ గా వార్తల్లో గల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఈటెల రాజేందర్ ను సీఎంగా చేయడమే సముచితమంటున్నారు. ఇంకోవైపు ఈటెలను ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ బండి సంజయ్ కూడా వాదిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితర నాయకులు కూడా ఈటెల రాజేందర్ సీఎం పదవికి అన్నివిధాలుగా అర్హుడని చెబుతున్నారు. తన తనయుడు కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తరహా పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇంతకీ తెలంగాణా రాజకీయాల్లో ఏం జరుగుతున్నట్లు? ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ రాసిన వ్యాసంలోని భావనకు, బీజేపీ వ్యూహాత్మక అడుగులకు, ఈటెల రాజేందర్ సీఎం పదవి అర్హుడంటూ పలు పార్టీలకు చెందిన నాయకుల వ్యాఖ్యలకు లంకె కుదురుతున్నట్లేనా? ప్రత్యేక రాష్ట్రంలో ఇవి భవిష్యత్ రాజకీయాలకు సంకేతమా? ఇదీ తెలంగాణా రాజకీయ వర్గాల్లో తాజా చర్చ.