ముఖ్యమంత్రి చెప్పే మాటలను మంత్రులు అనుసరించాలి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను ఫాలో కావడం అధికార పార్టీ నేతలు అలవర్చుకోవాలి. మంత్రివర్గ సభ్యులకు ఇది మరీ ముఖ్యం కూడా. ఇందుకు విరుద్ధంగా జరిగితేనే ఒక్కోసారి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరికొన్నిసార్లు సర్కారును సంకటంలోకి నెట్టేస్తాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే విధానాలపై, చెప్పే అంశాలపై మంత్రులు చేసే వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉంటే ప్రజల్లో అది తీవ్ర చర్చకు దారి తీస్తుంది. అంతేకాదు ప్రజల్లో గందరగోళాన్ని కలిగిస్తాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే తన వాదనను బాహాటంగానే వినిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై తనకు ఆజమాయిషీ ఉందని, రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని చెబుతూనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనని చెబుతుండడం విశేషం.
ఈటెల రాజేందర్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కొనుగోలు కేంద్రాల అంశంపై తాజా వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని ఎవరూ చెప్పలేదని నిరంజన్ రెడ్డి అంటున్నారు. నిన్న కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ) ధాన్యం కొంటే తాము కొనసాగిస్తామని ఆయన ప్రకటించడం గమనార్హం.
అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలపై గత డిసెంబర్ 27న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీఏ విజయ్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్న ఈ సమావేశం అనంతర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం తన విధానాన్ని ఎలా స్పష్టీకరించిందో, తాజాగా మంత్రులు ఈటెల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలేమిటో అవగతం చేసుకోవచ్చు. గత డిసెంబర్ 27న ప్రభుత్వం విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలోని ఈ భాగం ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదివేయండి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దు తిరుగుడు పువ్వు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు. రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తున్నది. దీనివల్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని వారు అభిప్రాయ పడ్డారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. మక్కల కొనుగోళ్ల వల్ల రూ. 1547.59 కోట్లు, జొన్నల వల్ల రూ. 52.78 కోట్లు, కందుల వల్ల రూ. 413.48 కోట్లు, ఎర్రజొన్నల వల్ల రూ. 52.47 కోట్లు, మినుముల వల్ల రూ. 9.23 కోట్లు, శనిగల వల్ల రూ. 108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్ల వల్ల రూ. 14.25 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణా ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు చెప్పారు.
‘‘ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదు. కొనుగోళ్లు – అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు. కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.