ఏ పత్రికైనా తన పాత్రికేయున్ని సంపూర్ణంగా విశ్వసించాలి. పత్రిక ముఖ్య బాధ్యులు తన సిబ్బందిని ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడే ఏ సంస్థలోనైనా, మరే వ్యవస్థలోనైనా క్వాలిటీ, క్రెడిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా జర్నలిజంలో దీనికి ప్రాధాన్యత మరీ ఎక్కువ. జర్నలిస్టుల్లో నానా రకాలు ఉంటుంటారనేది వేరే విషయం. కొందరు విలేకరులు అడుగు కదలకుండా తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించగలరు. ఇంకొందరు ఏ ప్రభుత్వ ఆఫీసు వెనకాలో గల నాలుగు చెట్ల మధ్య నిలబడి ఛత్తీస్ గఢ్ అడవుల నుంచి లైవ్ లో మాట్లాడుతున్నట్లు భ్రమింపజేయగలరు. మరికొందరు విలేకరులు ఓ లీడ్ పేర రాయడానికి చించేసే కాగితాలతో పక్కనే గల డస్ట్ బిన్ నిండిపోవచ్చు. ఈకోవకు చెందినవారు కంట్రిబ్యూటర్లు రాసిన వార్తల డేట్ లైన్ మార్చి దర్జాగా బతికేస్తుంటారు. ఇంకొందరు విలేకరులు ‘లాబీయింగ్’ ద్వారా నెట్టుకొస్తుంటారు. మరో కేటగిరీ విలేకరులు సంస్థకు యాడ్ రెవెన్యూను తీసుకువస్తూ అగ్రగణ్యులుగా ప్రాచుర్యం పొందుతుంటారు. పొట్ట చీలిస్తే అక్షరం ముక్కరానివారు కూడా కొందరు ఫేమస్ జర్నలిస్టులుగా మనుగడ సాగిస్తుంటారు. అదేదో సినిమాలో వెటకరించినట్లు నోరేసుకుని బతికేస్తుంటారన్నమాట. ఓ జర్నలిస్టు మిత్రుడు నిర్వచించినట్లు ప్రస్తుత జర్నలిస్టు భవిత చేతిరాతపై కాదు, నుదుటి రాతపై మాత్రమే ఆధారపడి ఉండవచ్చు.
కానీ సంస్థే ప్రాణప్రదంగా ప్రేమించే జర్నలిస్టులు కూడా ఉంటుంటారు. ఇంకా ఉన్నారు కూడా. ఇటువంటి కమిటెడ్ జర్నలిస్టులను కూడా సంస్థ లేదా అందులోని ముఖ్యబాధ్యులు శంకిస్తే…? నికార్సయిన జర్నలిస్టు నొచ్చుకుంటాడు. అతని మనసు చివుక్కుమంటుంది. ఏమిటి నాకీ పరీక్ష? అని మథనపడుతుంటాడు. మనోవేదన చెందుతుంటాడు. ఇప్పుడు ఇదంతా దేనికంటే…? టీఆర్ఎస్ ప్రభుత్వ కరదీపికగా ప్రాచుర్యం పొందిన ‘నమస్తే తెలంగాణా’ దినపత్రిక తెలుసు కదా! ఇందులో కొందరు ముఖ్యులు ఇటీవలి కాలంలో చిత్ర, విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు ఆ పత్రిక ఉద్యోగ వర్గాల్లోనే ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పత్రికలో పనిచేసే జర్నలిస్టుల విశ్వసనీయతను అనుమానిస్తున్నారు. నువ్వు ఫలానా చోటుకు వెళ్లినట్లు అక్కడే ఓ ఫొటో దిగి పంపాలని తమ అంతర్గత వ్యవహారాలపై మెసేజ్ ద్వారా ఆదేశిస్తున్నారు. ఫీల్డ్ విజిట్ చేయకుండా వార్తా కథనం రాయవద్దు అన్నంత వరకు ఓకే. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. విలేకరి రాసిన వార్తా కథనాన్ని పరిశీలిస్తే అతను ఫీల్డ్ విజిట్ చేశాడా? లేదా? అని పసిగట్టవచ్చు. గతంలో ఈ తరహా ఫీల్డ్ వర్క్ చేసిన బాధ్యులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ నిర్దేశించిన అసైన్మెంట్ కథనం రాసేవారు అక్కడే ఓ ఫొటో దిగి పంపాలని ఆదేశించడంపైనే నమస్తే తెలంగాణా పత్రికలోని జర్నలిస్టు వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. తమకు ఇదో శీల పరీక్షగా ఆ పత్రికకు చెందిన జర్నలిస్టులు కొందరు అభివర్ణిస్తున్నారు. మరీ ఈ తరహాలో పత్రిక బాధ్యులు ఆదేశించారా? అనే డౌటు ఉంటే దిగువన గల ఆయా మెసేజ్ ను ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదివేయండి. విషయం మీకే అర్థమవుతుంది.
మిత్రులారా..
ఈరోజు మన మెయిన్ లో పల్లె ప్రగతి సంబంధించి వార్త ప్రచురితమైంది. గమనించండి. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామాల్లో నవశకం సృష్టించింది.
ఈ నేపథ్యంలో సక్సెస్ స్టోరీలు ఇవ్వాలి. అవకాశం ఉంటే ఫెయిల్యూర్ స్టోరీలు కూడా చేయాలి. గ్రామాల్లో శిధిలమైన గృహాల తొలగింపు.. పాత బావుల పూడ్చివేత.. డంపింగ్ యార్డులు.. ఇంటర్నల్ రోడ్లు.. విద్యుత్ స్తంభాలు.. వైకుంఠ దామాలు.. పకృతి వనం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వీటిపై ప్రతి రిపోర్టర్ వారానికి రెండు స్టోరీలు ఇవ్వాలి. పల్లె ప్రగతి సంబంధించిన డేటా.. కార్యక్రమాలు.. ఇతర విశేషాలు వుండాలి. ఊళ్లో ప్రకృతికి సంబంధించిన ఫోటోలు.. సర్పంచ్.. వార్డు సభ్యులు.. ఊరిలో ప్రముఖులు.. ఇన్చార్జి అధికారులు తదితరులు అభిప్రాయాలూ ఇవ్వాలి.
ఫీల్డ్ విజిట్ లేకుండా ఐటమ్ చేయొద్దు. స్టోరీ ఫైల్ చేసేవారు ఆ గ్రామ పంచాయతీ ముందు ఫోటో దిగి పంపాలి.
ఈ కార్యక్రమాన్ని మనం చాలా రోజుల పాటు నిర్వహించాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలి.