● ఢిల్లీ పరేడ్ … ఎన్ని కుట్రలు
● మూడు చట్టాలపైన రైతాగ్రహం
● తొలి నుంచి సర్కారు అడ్డంకులు
● పరేడ్‌ను ప్రయోగానికి వాడుకున్నారా!?
● తలెత్తుతున్న అనేక ప్రశ్నలు
● సర్కారు చర్యలు దేనికి సూచిక
(✍️ రవి ® సంగోజు)
శ్రమజీవుల చరిత్రను లిఖించడంలో తొలి నుంచి తీవ్ర అన్యాయం జరుగుతోంది. చారిత్రాత్మక సంఘటనలు నమోదైన ప్రతీసారి వాటిపై పథకం ప్రకారం చెరగని నల్లటి మరకలు పూసి వాస్తవ విషయాలను మరుగు పరిచేందుకు జరగాల్సిన కుట్రలన్నీ జరిగాయి. చరిత్రలో వారి పాత్ర లేకుండా చేసేందుకు అనేక అణిచివేత పధ్ధతులు పాటించారు. ఇప్పటికీ అదే చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారు. రాజ్యంలోని అన్ని అంగాల పైన కొనసాగుతున్న వారి ఆధిపత్యం దీనికి ఎంతో దోహదం చేస్తుంది. తమ పనులు సులభతరం చేస్తున్నాయి.
చరిత్రలో ప్రజాస్వామికంగా అణగారిన వర్గాలు, కులాల పాత్ర లేనట్లే, వారి త్యాగాలను వక్రీకరిస్తూ రాయడంలో జరిగిన కుట్రల పైన చాలా కాలంనుంచి అనేక మందిలో తీవ్ర అసమ్మతి, అసంతృప్తి నెలకొని ఉంది. ఇలాంటి అభిప్రాయం మరెంతో మందిలో అంతర్గతంగానూ ఉండవచ్చు. గత చరిత్రను వర్తమానానికి వర్తింపచేయడంలోనూ వాస్తవాలు బహిరంగ పరచడంలోనూ పెద్ద కుట్ర దాగి ఉంది. ఇప్పటికైనా ఈ కులాలు,వర్గాలు దీనిపై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉన్నది. అప్పుడే జరిగే పరిణామాలు సహేతుకంగా అర్థమైతాయి.
తాజా ఢిల్లీ రైతుల పరేడ్ పైన నెలకొన్న కుట్రలతో మరోసారి ఈ విషయం తేటతెల్లమయ్యింది. ఈ చరిత్రాత్మక ఉద్యమంపైన తప్పుడు ముద్రలు వేయడంలో బహుముఖీయమైన కుట్రలు జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుడం గమనార్హం.
మూడు చట్టాల పైన రైతాగ్రహం:
అత్యంత అప్రజాస్వామిక పధ్ధతుల్లో అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతాంగం తిరుగుబాటును, కేంద్ర సర్కారు తీరును విచక్షణతో, నిశితంగా పరిశీలిస్తే అనేక అంశాలు మన కళ్ళ ముందు సాక్షాత్కారిస్తాయి. చట్టాల రూపకల్పన జరిగిన తొలినాళ్లలోనే పంజాబ్, హర్యానా, యుపీలలో రైతాంగం తొలిగా మేల్కొన్నది. గ్రామస్థాయి నుంచి చైతన్య కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని సంఘటితం చేశారు. అనేక అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఐదు వందల రైతు సంఘాలు ఏకతాటి పైకి వచ్చి కిసాన్ ఏక్తామోర్చా ఆధ్వర్యంలో అత్యంత బలమైనదిగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల, ఈ శతాబ్దంలో జరిగిన అనూహ్య ప్రతిఘటనగా పలువురు పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.
లక్షలాదిమంది కుటుంబాలతో సహా తరలివచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో తమ సత్తా చాటారు.
తొలి నుంచి సర్కారు కుట్రలు:
ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడాలో అన్ని కుట్రలు చేస్తూ వస్తున్నది. అనేక దుష్ప్రచారాలు, రకరకాల ముద్రలు వేసి, రైతాంగాన్నీ వారి పోరాటం, త్యాగాలను కించపరిచేందుకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలను తమ అధికారాన్ని ఉపయోగించుకుని విచ్చలవిడిగా కొనసాగించింది. అయినప్పటికీ రైతాంగం ఎక్కడా వెనుకంజ వేయకుండా పట్టుదలతో తమ అనుభవాన్ని మేళవించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో అనేక దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు సాగిస్తూ అరవై మూడు రోజులుగా ఉద్యమాన్ని నిలబెట్టడంలో విజయవంతం అయ్యారు. చివరికి రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైతాంగం ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో నుంచి అనేక కుయుక్తులు, కుట్రలు పన్నుతూ తమ చేతుల్లోని అనుకూల మీడియాతో దుష్ప్రచారం కొనసాగించారు.
పరేడ్‌ను వినియోగించుకున్నారా!?:
రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్‌ను తమకు అనుకూలంగా వినియోగించుకునేందుకు ఒక ప్రణాళిక రచించిందని రైతు నేతలు ఆరోపించారు. ముందురోజు పాకిస్థాన్, ఖలీస్తాన్లు అంటూ గొంతు పెద్దది చేశారు. సంఘవ్యతిరేక శక్తులు చొరబడుతారని ప్రచారం లంకించుకొని, ప్రమాదం ఉందని ముందు చెప్పిన సర్కారు తీసుకున్న ముందు జాగ్రత్తలు ఎక్కడా కనిపించకపోవడం ఇక్కడ విడ్డూరం. ఇది సర్కారు వైఫల్యమైతే ఎవరు బాధ్యత వహించాలి?
సరే వాదన కోసం ఎర్రకోటపైన రైతులు హంగామా చేశారనుకున్నా రైతుల ముసుగులో ఇతరులు దాడులు చేస్తే పరిస్థితి ఏంటిదనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకుని ఉంటే వాటి జాడలెక్కడ….!? ఈ క్రమంలోనే దీప్‌సిద్దూ లాంటి తమ అనుకూలవాదులను కొంతమందిని రైతాంగ ఉద్యమంలోకి చొప్పించి సహజంగానే మరికొందరు అమాయక రైతులను రెచ్చగొట్టి సాఫీగా సాగుతున్న ర్యాలీలో కొందరిని ఢిల్లీ ఎర్రకోట వైపు మళ్లించేందుకు ప్రయత్నించారనేది రైతుసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతాంగం పోలీసుల మధ్య కొంత హింసాత్మక సంఘటనలు జరిగాయి. చివరికి ఎర్రకోటపై ఉన్న జెండా కర్రకు సిక్కు మతానికి, రైతు సంఘాలకు సంబంధించిన జెండాలను కట్టారు. ఇదంతా మోదీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తలెత్తుతున్న అనేక ప్రశ్నలు:
రిపబ్లిక్ డే రోజు అత్యంత భారీ భద్రత మధ్య ఉత్సవ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమైన విషయం అందరికీ తెలుసు. ఆ సమయంలో ఎర్రకోటపైకి రైతాంగంలోని కొంతమంది దీప్‌సిద్దూ ఆధ్వర్యంలో అత్యంత సులభంగా ఎలా? చేరారనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ తతంగాన్నీ అక్కడే ఉన్న అన్ని రకాల సాయుధ బలగాలు ఎలా చూస్తూ ఉన్నాయనేది పెద్ద ప్రశ్న. పైగా ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడ్డారు. తమ ప్రాణాలు పణంగా పెట్టేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఒక విధంగా ప్రేక్షక పాత్ర వహించారు. ఇంత సహనం ఎలా పాటించారు. ప్రభుత్వ వైఫల్యమా? ఖచ్చితమైన ఆదేశాలా? పకడ్బందీ ప్రణాళికా అనే అనుమానం ఎవరికైనా తప్పక కలుగుతోంది.
కొన్ని సమయాల్లో సహనం కోల్పోయి ఉద్వేగంతో అంత పెద్ద నిరసనలో కొందరు ఇలాంటి ఘటనలకూ పాల్పడే అవకాశాలు ఉంటాయనుకున్నా వీటిని ఎవరు నియంత్రణచర్యలు చేపట్టాలి. సర్కారు కాదా? ముందు హింస ప్రజ్వరిల్లనియ్యండి తాపీగా కిసాన్ ఏక్తామోర్చా నేతలపైన కేసులుపెట్టి అరెస్టులు చేస్తే ఉద్యమం నిలిచిపోతుందని బావించారా!? తేలాల్సి ఉంది. లక్షలాది మందితో సాగిన రైతాంగ ప్రధాన ప్రవాహ పరేడ్‌ను ఈ సంఘటనలకు ముందు ఏ మీడియా పట్టించుకోకుండా వ్యవహరించిందనే ఆరోపణలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. లక్షలమంది రైతులు చేసే ప్రధాన ర్యాలీని విస్మరించి ఆకస్మికంగా పిల్ల కాలువలాంటి వాటిపైన మీడియా ఫోకస్ ఎలా జరిగింది? మరీ ముఖ్యంగా బారికేడ్లు తొలగించే సమయంలో, పోలీసులను తరుముతున్న సందర్భంగా వీరంతా ప్రత్యక్షం కావడం గమనార్హం. పైగా ఎక్కడలేని ప్రచారం కల్పించడంలోనే కుట్రలు దాగివున్నాయని విమర్శలు వ్యక్తమైతున్నాయి.
లక్షలాది మంది రైతాంగం వేలాది ట్రాక్టర్లతో నిర్వహించిన శాంతియుత పరేడ్ పై అశాంతి సృష్టికర్తలుగా ముద్ర వేసేందుకు రచించిన అంతరంగిక పథకమా? హింసాత్మక సంఘటనలు పాల్పడటానికి, ఎర్రకోటపై సులభంగా జెండా ఎగరేసేందుకు అవకాశం కల్పించడంలోనే అంతర్గతంగా పెద్ద ప్రణాళిక జరిగిందని ఆ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అర్థమైతుందని అంటున్నారు. ఏమైనా ఎర్రకోట ఎపిసోడ్‌తో పాటు పోలీసులపైన దాడులను తక్షణమే ఏక్తామోర్చా నాయకులు ఖండించడం గమనార్హం. తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
సర్కారు చర్యలు దేనికి సూచిక?
పరేడ్ తర్వాత చకచకా జరిగిన దుష్ప్రచారం, కేసులు, మీడియా చర్చలు రుజువు వీటిని చేస్తున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కేంద్రం చారిత్రాత్మక రైతు ఉద్యమంపై హింస ముద్రవేసి వారి డిమాండ్లను పక్కదోవ పట్టించేందుకు కుయుక్తులు పన్నారనేది తెల్సిపోతుంది. విపక్షాల నుంచి కూడా ఇదే గట్టి అభిప్రాయం వ్యక్తమవుతోంది. తదనంతరం లోకల్ జనాలను రెచ్చగొట్టే చర్యలు, రాళ్ళ దాడులు, భారీ బలగాల మోహరింపు, పేలుళ్లు ఈ పరంపర దేన్ని సూచిస్తున్నాయి…!? రైతులు రెచ్చిపోయి హింసాత్మక సంఘటనలకు పాల్పడితే ఉక్కు పాదంతో అణిచివేయాలనేది అధికార పార్టీ ఆలోచనగా స్పష్టమవుతుంది.
అరవై మూడు రోజులు సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో రైతాంగం ఓపికను ఒక్కసారిగా పక్కకు పెట్టి దేశ ద్రోహులుగా చిత్రించేందుకు జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. రైతు ఉద్యమం సందర్భంగా మూతపడిన దేశభక్తి నోళ్లు ఇప్పుడు అడ్డూ అదుపు లేకుండా విరుచుకుపడుతున్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా సాగుతున్న ఉద్యమం పట్ల సర్కారు సాగదీత ధోరణిని ప్రశ్నించకుండా ప్రధాన సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు.
రైతులను విమర్శించడం సిగ్గుచేటు:
నిజంగానే రైతాంగం ఎర్రకోటపైన జెండా ఎగరేసి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకుంటే మొత్తం ర్యాలీలు ఎర్రకోట చేరుకునే అవకాశం ఉండేవి. అక్కడే రైతాంగం బైఠాయించి తమ డిమాండ్లు నెరవేరే వరకు కదిలే వారు కాదు . కానీ దీనికి భిన్నంగా కొద్ది మంది చేసిన హంగామా, ధ్వంసం, దాడులు మినహా పరేడ్ సాఫీగా జరిగిందనేది కిసాన్ సంయుక్త మోర్చా ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముందస్తుగా అన్ని రకాల ఆయుధాలు చేతిలోకి తీసుకుని రాజ్యం తమ ప్రణాళికలు అమలుచేసినట్లు జరిగిన సంఘటనలు సూచిస్తున్నాయి. ఇదే అంశాలు సంయుక్త రైతుసంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రాత్మక రైతాంగ ఉద్యమంపైన హింసాత్మక మరకలు వేసి వాస్తవాలు తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గొప్ప ప్రతిఘటననూ త్యాగాలను చరిత్ర చెత్తబుట్టలోకి విసిరే కుట్రలు అమలు చేస్తున్నారు. ఈ విషవలయంలో చిక్కకుండా నాయకత్వం తగిన జాగ్రత్తవహించాల్సి ఉంది. ఇప్పటికే దీన్నుంచి వేగంగా బయటికి వచ్చేందుకు రైతాంగం తీవ్రంగా ప్రయత్నించడం తాజా మంచి పరిణామం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే తీరు సర్కారు వ్యవహారంగా ఉంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ముందుకు సాగాల్సి ఉంది. గెలుపోటములు పక్కనపెట్టి ఈ రైతుల పోరాటానికి కనీస మధ్ధతు అందించకుంటే చరిత్ర ఎవర్నీ కూడా క్షమించదేమో!?