తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం ఇక సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లినట్లే కనిపిస్తోంది. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలు ప్రామాణికమే కాదని, సీఎం కేసీఆర్ చెప్పిందే ఫైనల్ అవుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ లతో కూడి త్రిసభ్య కమిటీతో నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఎన్జీవో, టీఎన్జీవో సంఘాల నేతలు ఎం.రాజేందర్, మమత తదితరులు చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 2018 నుండి ఇప్పడివరకు పీఆర్సీ రాలేదని, సీఎస్ నేతృత్వంలో త్రిమెన్ కమిటీ తో పీఆర్సీ తో చర్చించామని, 7.5 శాతం ఫిట్ మెంట్ ను అంగీకరించబోమని, తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని చెప్పారు. ఫిట్ మెంట్ 7.5 శాతం అనేది కమిటీ రిపోర్ట్ మాత్రమేనని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన 43శాతం ఫిట్ మెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలన్నారు.
సీఎం చెప్పిన ప్రకారమే ఫిట్ మెంట్ ఫైనల్ అవుతుందని, తమకు సీఎం కొత్త కాదని, ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని చెప్పారు. ఇది పీఆర్సీ కమిటీయా? పిసినారి కమిటీయా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పీఆర్సీ నివేదిక అన్యాయంగా, అశాస్త్రీయంగా ఉందన్నారు. హెచ్ ఆర్ జిల్లాల్లో 20, హైదరాబాద్ లో 30 శాతం ఉండాలని, ఫిట్ మెంట్ విషయంలో సీఎంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈ రిపోర్టుపై ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, అందరికి అనుకూలంగా ఉంటుందన్నారు. సీఎంకు సిఫారసు చేయాలని సీఎస్ కు చెప్పామని, సీఎంతోనే తేల్చుకుంటామన్నారు. తాము కష్టపడి పనిచేస్తున్నామని, 63 శాతం ఫిట్ మెంట్ తాము అడుగుతున్నామన్నారు. తమకు రాజకీయాలు అవసరం లేదని, చర్చలకు పిలిస్తేనే వచ్చామని, లౌక్యంతో సాధిస్తామని, కమిటీ రిపోర్ట్ ను చెత్తబుట్టలో వేశామన్నారు. ఇదిలా ఉండగా పీఆర్సీ కమిటీ చేసిన సిఫారసుల నివేదికపై జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల ఉద్యోగ వర్గాలు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగుతున్నారు.