ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రకటన గుర్తుంది కదా? గత ఆదివారం తన ‘కొత్తపలుకు’ శీర్షికన ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అలియాస్ అర్కే రాసిన వార్తా కథనంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పేరున జారీ అయిన ‘పత్రికా ప్రకటన’ ఇది. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఆక్షేపిస్తూ వెలువడిన ఈ ప్రకటనను ఆ పత్రిక ఏ మాత్రం పట్టించుకోకపోవడం తాజా చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ తరహా వార్తా కథనాలు, ఆ తర్వాత వచ్చే ఖండనల వంటి ప్రకటనలకు జర్నలిజంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏదేని కుంభకోణం, లేదంటే ఇతరత్రా ‘స్కూప్’ స్టోరీలు రాసే సందర్భంగా సంబంధిత వ్యక్తుల, సంస్థల వివరణ తీసుకోవాలనేది జర్నలిజంలో ప్రాథమిక సూత్రం, ఈ ‘ఎథిక్స్’కు ఇప్పుడెవరు కట్టుబడి ఉన్నారనేది వేరే విషయం. కానీ విలువల పాత్రికేయం గురించి చర్చ జరిగినపుడల్లా ఈ ప్రస్తావన వస్తుంటుందనేది నిర్వివాదాంశం.
మొన్నటి ఆదివారం నాటి తన కొత్తపలుకు కాలమ్ ద్వారా ఆర్కే తనదైన శైలిలో రాసిన వార్తా కథనం గురించి తెలిసిందే. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తన సోదరుడైన జగన్ పై ఆగ్రహంతో ఉన్నారని, తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కారణంతో రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే పొలిటికల్ బాంబును ఆర్కే పేల్చారు. షర్మిల స్థాపించే పార్టీకి ‘తెలంగాణా వైఎస్ఆర్ కాంగ్రెస్’గా నామకరణం చేశారని, వచ్చేనెల 9న షర్మిల మీడియా సమావేశంలో పార్టీ గురించి ప్రకటన చేస్తారని కూడా ఆర్కే రాసుకొచ్చారు.
బేసిక్ గా జర్నలిస్టు అయిన ఆర్కే రాసే వార్తాంశాలు ఎక్కువ సందర్భాల్లో చర్చకు దారి తీస్తుంటాయి. ఇందులో ఏ సందేహం లేదు. ఈ కోవలోనే షర్మిల కొత్త పార్టీపై ఆర్కే రాసిన కథనం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే చర్చకు దారి తీసింది. సోమవారం నాటి సంచికలో ఆర్కే రాసిన కథానికి ఫాలో అప్ స్టోరీని కూడా ప్రచురించడం గమనార్హం. అయితే ఈ వార్తా కథనంపై షర్మిల పేరుతో ఓ ప్రకటన వెలువడింది. జర్నలిజపు ‘ఎథిక్స్’ ప్రకారం వార్తా కథనం రాసే సందర్భంగా వివరణ తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆ తర్వాత జారీ చేసిన ప్రకటనను ప్రచురించాల్సిన బాధ్యత కూడా సంబంధిత పత్రిక లేదా వార్తా సంస్థకు ఉంటుంది.
కానీ షర్మిల ప్రకటనను ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. సోమవారం సాయంత్రం షర్మిల పేరున ఓ ప్రకటన వెలువడింది. ‘సాక్షి’ దినపత్రిక ఈ ప్రకటనను తన మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో మరుసటి రోజు ప్రముఖంగా ప్రచురించింది. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం షర్మిల ప్రకటనను బేఖాతర్ చేయడం గమనార్హం. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ భారీ ఎత్తున వార్తా కథనాన్ని పబ్లిష్ చేసిన ఆంధ్రజ్యోతి ఆమె పేరున వెలువడిన ప్రకటనను ఎందుకు ఖాతర్ చేయలేదు? ఇదీ జర్నలిస్టు సర్కిళ్లలో తలెత్తుతున్న సందేహం.
ఆంధ్రజ్యోతి ఉద్యోగ వర్గాల సమాచారం ప్రకారం… షర్మిల తన ప్రకటనను ఆంధ్రజ్యోతి సంస్థకు పంపలేదు. అంతేగాక తెల్ల కాగితంపై షర్మిల ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమేంటి? అనేది ఆ సంస్థ ముఖ్యులు లేవనెత్తుతున్న సందేహం. అంతే కాదు షర్మిల పేరుతో వెలువడిన ఈ ప్రకటనలో తాను ‘పార్టీని స్థాపించడం లేదు’ అనే ప్రస్తావన కూడా లేకపోవడాన్ని ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి ఉద్యోగ వర్గాలు ఉటంకిస్తున్నాయి. తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడం తప్పు వంటి తదితర వాక్యాలు మాత్రమే షర్మిల పేరుతో వెలువడిన ప్రకటనలో ఉన్నాయే తప్ప, పార్టీ ఏర్పాటు అంశంపై ఏ ప్రస్తావన లేదనేది ఆయా వర్గాల వాదన.
షర్మిల పేరున వెలువడిన ప్రకటనపై ఏబీఎన్ ఛానల్ లో డిబేట్ నిర్వహించినట్లుంది. కానీ పత్రికలో మాత్రం అక్షరం ముక్క రాయకపోవడం గమనార్హం. ఇదే దశలో షర్మిల ప్రకటనలోని ఆయా అంశాలను ఉటంకిస్తూగాని, తాము ఆదివారం రాసిన కథనానికి కట్టుబడి ఉన్నామనిగాని ఆంధ్రజ్యోతి మళ్లీ ఇంకో కథనాన్ని తన పాఠకులకు వడ్డించకపోవడం కూడా గమనించాల్సిన అంశమే.