ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) నివేదిక లీకైందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారా? ఉద్యోగుల ‘మూడ్’ ఎలా ఉందో తెలుసుకునే ప్రక్రియలో భాగంగా మందస్తుగా పీఆర్సీ నివేదిక లీకైందా? ఇవీ ఉద్యోగ వర్గాల తాజా సందేహాలు. ఎందుకంటే ప్రభుత్వానికి పీఆర్సీ కమిటీ తన నివేదికను ఇప్పటికే సమర్పించింది. ఈరోజు మధ్యాహ్నం ఆయా నివేదిక కాపీలను ఉద్యోగ సంఘాలకు ఇవ్వడంతోపాటు, వెబ్ సైట్లో పెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్టారావు, రజత్ కుమార్ లతో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా నిర్వహించనుంది.
అయితే ఈ ప్రక్రియకు ముందే పీఆర్సీ నివేదిక పేరుతో 275 పేజీల పీడీఎఫ్ ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో 7.5 ఫిట్ మెంట్ ను పీఆర్సీ కమిటీ ప్రతిపాదించినట్లు 5వ పేజీలో ఉండడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో తిరుగుతున్న పీడీఎఫ్ ఫైల్ ఒరిజినల్ నివేదికేనా? అనే అంశంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు సంశయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ నివేదికపై కమిటీ సభ్యుల సంతకాలు ఏవీ లేవని, సంతకాలు లేని నివేదికను అధికారిక ప్రతిగా ఎలా భావిస్తామని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే 7.5 పీఆర్సీ ఫిట్ మెంట్ అంశంపై భిన్న వాదన వినిపిస్తోంది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు సందర్భంగా 75 శాతం ఫిట్ మెంట్ ను ఉద్యోగులు ఆశించారని, కనీసం 60-65 మధ్య ఉంటుందని అంచనా వేశామని, చివరికి 63 శాతం ఖరారు కావచ్చని భావించామని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. చివరికి 7.5 ఫిట్ మెంట్ గా ప్రచారం జరుగుతుండడంపై ఉద్యోగ వర్గాలు నివ్వెరపోతున్నాయి. కేవలం 7.5 ఫిట్ మెంట్ ను అంగీకరిస్తే, అంతకన్నా దారుణం మరొకటి ఉండదనే వాదన వినిపిస్తోంది. పీఆర్సీ నివేదికపై ఈరోజు సాయంత్రం చర్చలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో తిరుగుతున్న నివేదిక ప్రతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.