మన మీడియాకు ‘ఆత్రం’ కాస్త ఎక్కువే సుమీ!
‘ఆలు లేదు… చూలూ లేదు… కొడుకు పేరు సోమలింగం’ తెలంగాణా పాపులర్ సామెతల్లో ఇదీ ఒకటి. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే…? తెలంగాణా రాజకీయ తెరపై తాజా దృశ్యం కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడు? ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని కొన్ని రోజులుగా మీడియాలో రకరకాల వార్తా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఆ పార్టీ నాయకుల, కేడర్ అభిలాష కావచ్చు. ఇందులో ఏ సందేహమూ లేదు. కేటీఆర్ సీఎం కావడంపై ఎవరికీ అభ్యంతరం కూడా ఉండకపోవచ్చు. ప్రజలు పట్టం గట్టిన అధికార పార్టీ ఎప్పుడైనా, ఎన్నడైనా తమ ఎమ్మెల్యేల్లో ఎవరినైనా సీఎంగా చేసుకోవచ్చు. రాజ్యాంగపరంగా లభించిన అవకాశమిది. ఇప్పుడు సీఎం మార్పు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అభీష్టమా? కాదా అనేది వేరే విషయం. ఈ విషయంలో తాను ఏది తల్చుకుంటే అది జరుగుతుందనేది కాదనలేని వాస్తవం.
కేటీఆర్ సీఎం కావాలని ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలు పడి మరీ ప్రకటనలు చేస్తున్నారు. విపక్ష పార్టీల వ్యాఖ్యల ప్రకారం సీఎం మార్పు టీఆర్ఎస్ పార్టీ అంతర్గత అంశం. కానీ కేటీఆర్ సీఎం కావాలంటే రాజ్యాంగం ప్రకారం ప్రక్రియ జరగాలి. గులాబీ పార్టీ నాయకులు కోరుకుంటున్నట్లు ప్రస్తుత సీఎం కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కూర్చోవాలంటే టెక్నికల్ గా ప్రాసెస్ జరగాల్సి ఉంది. రాజ్యాంగ నిపుణుల కథనం ప్రకారం… కేటీఆర్ సీఎం కావాలంటే ముందు కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలి. ఇందుకు సంబంధించి రాజీనామా లేఖను గవర్నర్ కు పంపాలి. ఫలితంగా ప్రస్తుత మంత్రి వర్గం సహజంగానే రద్దవుతుంది. అనంతరం టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలి. తెలంగాణారాష్ట్ర సమితి శాసనసభా పక్ష (టీఆర్ఎల్పీ) నేతగా కేటీఆర్ ను ఎన్నుకోవాలి. ఈ సందర్భంగా చేసిన తీర్మానపు కాపీని రాష్ట్ర గవర్నర్ కు పంపాలి. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ ను గవర్నర్ ఆహ్వానిస్తారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా లేదంటే, కాస్త సమయం తీసుకుని తన మంత్రివర్గాన్ని కొత్త ముఖ్యమంత్రి కూర్పు చేసుకోవచ్చు. ఇదో పద్ధతి.
కేటీఆర్ సీఎంగా ఎన్నికయ్యేందుకు మరో పద్ధతి కూడా ఉంది. టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అక్కడే కేసీఆర్ సీఎం పదవికి చేసిన రాజీనామాను ఆమోదించి, అక్కడికక్కడే కొత్త శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ ను ఎన్నుకోవడం వంటి ప్రక్రియను కూడా ఏకకాలంలో జరపవచ్చు. ఈ ప్రక్రియ కూడా సీఎంగా కేసీఆర్ రాజీనామా ఆమోదంతోనే మంత్రివర్గం రద్దవుతుంది. అనంతరం ప్రస్తుత సీఎం రాజీనామా, కొత్త నేత ఎన్నికకు సంబంధించిన తీర్మానపు కాపీని గవర్నర్ కు టీఆర్ఎస్ ఎల్పీ సభ్యులు గవర్నర్ కు అందిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం అందే అవకాశం ఉంది. ఇవీ సీఎం మార్పులో కీలక పద్ధతులు.
కానీ మన తెలుగు మీడియా, ముఖ్యంగా తెలంగాణా మీడియా మరీ అడ్వాన్స్ కదా? కాస్త ఆత్రుత కూడా ఎక్కువే. పెరిగిన పోటీ ప్రపంచంలో అందరికన్నా ముందు వార్తా కథనాలను వండి, వార్చినంత మహదానందాన్ని ఎప్పటినుంచో బాగా వంట బట్టించుకుంది. ఇప్పటి వరకు సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం అనేది ఓ ప్రచారం మాత్రమే. అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. ప్రక్రియ కూడా లేదు. గడచిన ఏడాది కాలంగా సాగుతున్న ప్రచారమే. కానీ మన తెలుగు పత్రికలు కొన్ని తాజాగా ఎటువంటి వార్తా కథనాలను ప్రచురించాయో తెలుసా? కేటీఆర్ సీఎం అయితే డిప్యూటీ సీఎం ఎవరు? కీలక శాఖలు ఎవరి వద్ద ఉంటాయి? కవిత మంత్రి కావడం ఖాయం? హరీష్ రావుకు కీలక శాఖలు అప్పగించే ఛాన్స్? కేటీఆర్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు? ఈటెల రాజేందర్ డిప్యూటీ సీఎం కావడం ఖాయం? పొంగులేటిశ్రీనివాసరెడ్డికీ బెర్త్ ఖాయం? ఇలా సాగిపోయాయి వార్తా కథనాలు. తన తనయుడు కేటీఆర్ ను సీఎం చేయడంపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికర అంశమే. కానీ దానికీ ఓ ప్రాసెస్ ఉంటుంది. అప్పటి వరకు కనీసం ఆగకుండా ఆత్రుతను ప్రదర్శించడమే తెలుగు మీడియా, మరీ ముఖ్యంగా తెలంగాణా మీడియా ప్రత్యేకత. మొదట ప్రస్తావించిన సామెతకు, ఈ వార్తా కథనాల తీరుకు పొంతన కుదిరినట్లేగా! అదీ చెప్పదల్చుకున్న అసలు విషయం.