మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సీఎం కేసీఆర్ శనివారం వెల్లడించారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లు కూడా సీఎం వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్య కరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను కోరారు. మిషన్ భగీరథ నీళ్లు ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు. మిషన్ భగీరథ నీటిని తాగాలని ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ నీళ్లలో అన్ని మినరల్స్ తగిన పాళ్ళలో ఉన్నాయని చెప్పారు.
కాగా వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు.
పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల-వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం-కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన-ఉద్దండాపూర్ కాలువ, టన్నెల్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సిఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవతుందని కేసీఆర్ అన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సీఎం సమీక్షించారు.