మెుక్క విలువను తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరీ ప్రశ్నిస్తున్నారు. మొక్కకు అంత భానీ విలువ లేనట్లుగా ఉత్తమ్ చేస్తున్న ఆరోపణలు బహుషా అధికార పార్టీ నేతలకు రుచించకపోవచ్చు కూడా. ఇంతకీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ ఏమిటంటే… ఆ మధ్య హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. కాబోయే సీఎంగా ప్రాచుర్యంలో గల మంత్రి కేటీఆర్ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఓ మొక్కను నాటారుట. ఆ మొక్కకు చూపిన ఖర్చు కేవలం రూ. 4.30 లక్షలు మాత్రమేనట. ఈ మొక్కకు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమేంటన్నది ఉత్తమ్ ప్రశ్న. అంతే కాదండోయ్… ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభ పేరుతో మరో రూ. 50 లక్షలు కాజేసేందుకు ఎజెండాను తయారు చేశారని, కౌన్సిలర్లు దీన్ని ప్రశ్నించడతో మార్పు చేశారని కూడా ఉత్తమ్ చెబుతున్నారు.
మంత్రి కేటీఆర్ నాటిని మొక్క ఖరీదు రూ. 4.30 లక్షలు అనే విషయంపై ఉత్తమ్ రాద్దాంతం చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ మొక్కలు ఇక్కడివి కాకపోవచ్చు. ఈ మధ్య పల్లె ప్రకృతి వనం పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణ ఏర్పాటుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. పట్టణాల్లోనూ, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో కూడా సుందరీకరణ పేరుతో భారీగా మొక్కలను నాటుతున్నారు. పల్లె ప్రకృతి వనం కింద చేపడుతున్న కార్యక్రమాలకు మొక్కలను తీసుకురావడానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ‘టూర్లు’ కూడా వేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి, కడియం వంటి ప్రాంతాలకు వెళ్లి మొక్కలను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన మొక్కలను కూడా నాటుతున్నారు. ఒక్కో మొక్కను రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు వెచ్చించి మరీ కడియం నుంచి తీసుకువస్తున్నారుట.
సాధారణ స్థాయి సర్పంచులు, మున్సిపల్ కార్పొరేటర్లు నాటుతున్న మొక్కలే వేలాది రూపాయల ఖరీదు చేస్తుంటే, కాబోయే సీఎం కేటీఆర్ వంటి నాయకుడు నాటే మొక్క ఖరీదు లక్షల్లో ఉండడంలో తప్పేముంది? అంటున్నారు కొందరు. ఓ మొక్కకు రూ. 4.30 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడాన్నిఉత్తమ్ నిలదీయడం అస్సలు సమంజసంగా లేదంటున్నారు. ఎందుకంటే ఆంధ్రాలోని కడియం వంటి సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చే ఆహ్లాదకర మొక్కలకు ఆ మాత్రం రవాణా ఖర్చులు, వాటి వెంట రక్షణకోసం గల నాయకులు, అధికారులకు ‘సాదర’ ఖర్చులు కలుపితే మొక్క ఖరీదు ఈ మాత్రం ఉండదా? విషయాన్ని అర్థం చేసుకోకుండా ఉత్తమ్ వంటి నాయకులు మొక్క విలువను తీసేస్తూ ప్రశ్నించడం భావ్యమా!