మీడియాపై సినిమావాళ్లు సెటైర్లు ఎందుకు వేస్తారు? కొన్ని సినిమాల్లో అయితే కొందరు మీడియా ప్రతినిధుల తీరుతెన్నుల వలువలూడ్చి మరీ నడిబజారులో నిలబెట్టే విధంగా సెటైర్లు విసురుతూ కామెడీని పండిస్తుంటారు దర్శకులు. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే… కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గుర్తుంది కదా? ఆ చిత్రంలో వార్తల ప్రెజెంటేషన్ వ్యవహారంపై జర్నలిస్టు పాత్రలో గల బ్రహ్మానందాన్ని హీరో పవన్ కళ్యాణ్ ఉతికి ఆరేస్తుంటాడు.
‘నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ, తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెబితే అది చేయడమే అన్నారు’ అని పవన్ కళ్యాణ్ చెప్పిన వాక్యాలను, జర్నలిస్టు పాత్రలో గల బ్రహ్మానందం తనదైన శైలిలో మల్చుకుంటాడు. ‘దేనికైనా సయ్యంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవానుంచి ఊడిపడ్డ ఈ జఘన సుందరి దర్శకుడు కోరితే బికినీయే కాదు…, ఎంత దూరం వెళ్లడానికైనా, ఏం చేయడానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసింది’ అని బ్రహ్మానందం తనదైనశైలిలో చెప్పేయగానే, పవన్ కళ్యాణ్ అతని చెంప ఛెళ్లుమనిపిస్తాడు. అది సినిమా సీన్.
సినీ నటి అర్చన ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో, ఏమోగాని.., సరిగ్గా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని సన్నివేశాన్ని తలపించేవిధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ ‘తంబునెయిల్’ను క్రియేట్ చేసింది. అదేమిటో ఇక్కడ మీరే చూడండి. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని సెటైర్ సీన్ ను గుర్తుకు తెచ్చుకోండి. విషయం మీకే అర్థమవుతుంది.