విగ్గు పెట్టుకుని తనను మోసగించి పెళ్లి చేసుకున్నాడని ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. అయితే ఐదేళ్ల కాపురం తర్వాత తన భర్త విగ్గు మోసాన్ని ఆమె గమనించారు. తనను అన్యాయం చేశాడని, ఛీటింగ్ చేసిన తన భర్తపై చర్య తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెడితే… చెన్నయ్ లోని ఆలపాక్కానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి 27 ఏళ్ల యువతిని అయిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తన బట్ట తలకు విగ్గు ముసుగేసి రాజశేఖర్ పెళ్లి చూపులకు వెళ్లాడు. ఆ తర్వాత అదే విగ్గుతో పెళ్లి కూడా చేసుకున్నాడు. నాణ్యత గల వెంట్రుకలతో తయారైన మేలిమిరకం విగ్గును ధరించిన రాజశేఖర్ చర్యను పెళ్లి సందర్భంగా బాధితురాలితోపాటు ఆమె కుటుంబీకులు, బంధువులు కూడా పసిగట్టలేదు.
ఆకర్షణీయమైన జుత్తుతో తన భర్త సినిమా హీరోలా ఉన్నాడని మురిసిపోయిన పెళ్లి కూతురి సంబరం ఎంతో కాలం నిలవలేదు. ఇటీవల విగ్గులేకుండా బోడిగుండుతో కనిపించిన తన భర్తను చూసి ఆమె నివ్వెరపోయింది. ఇదే అంశంపై ఇరువురి మధ్య పంచాయతీ కూడా మొదలైంది. పెళ్లి సందర్భంగా తన పుట్టింటివారు ఇచ్చిన రూ. 2.00 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను తిరిగి ఇచ్చేయాలని భర్తను భార్య డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు తనపై దాడి చేసి గాయపరిచారని, విగ్ ధరించి తనను మోసగించిన భర్త రాజశేఖర్ పైనా, అత్తింటివారిపైనా చర్య తీసుకోవాలని బాధితురాలు తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.