‘‘న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపాన్ని సంతరించుకోకూడదు. అదే జరిగితే న్యాయం తన సహజ గుణాన్ని కోల్పోతుంది. తక్షణ న్యాయం అంటూ ఉండదు.’’
-రాజస్థాన్ హైకోర్టు కొత్త భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఈనెల 7వ తేదీన స్పష్టం చేసిన అంశమిది.
‘‘మీరు తప్పు చేశారని మేం అనడం లేదు. కానీ దర్యాప్తులో లభిస్తున్న ప్రతి ఆధారం వెంటనే మీడియాకు ఎలా వెడుతోంది? అందుకే పారదర్శక విచారణ జరిపించాల్సిన అవసరముంది. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది.’’
-దిశ ఎన్కౌంటర్ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా జస్టిస్ బోబ్డే ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయంలోని మరో అంశమిది.
హైదరాబాద్ దిశ ఘటనలో నిందితులైన నలుగురి ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుకర్ నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ లో ముంబయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ లను సభ్యులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిషన్ చేసే దర్యాప్తునకు తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే ఓ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నేరుగా విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయడం భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ప్రథమంగా న్యాయ నిపుణులు కొందరు ఉటంకిస్తున్నారు. సాధారణంగా ఎన్కౌంటర్ ఘటనలపై ఎక్కువగా మెజిస్టీరియల్ విచారణలే జరుగుతుంటాయి. రెవెన్యూ అధికారులు నిర్వహించే విచారణలను మెజిస్టీరియల్ విచారణలుగా వ్యవహరిస్తుంటారు. కొన్ని అరుదైన ఘటనల్లో మాత్రం న్యాయ విచారణ (జ్యుడిషియల్ ఎంక్వయిరీ) జరుగుతుంటుంది. అత్యంత వివాదాస్పదమైన ఆరోపణలు వచ్చిన ఎన్కౌంటర్ ఘటనల్లో న్యాయ విచారణలు జరుగుతుంటాయి. ఈ తరహా న్యాయ విచారణ కమిటీలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తాయి. ఉదాహరణకు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా సర్కేగూడ ఎన్కౌంటర్ ఘటనపై రమణ్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించింది. సర్కేగూడ ఉదంతంలో 17 మంది ఆదివాసీలను మావోయిస్టు నక్సలైట్ల పేరుతో భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు జస్టిస్ అగర్వాల్ కమిటీ తాజాగా నివేదించిన సంగతి తెలిసిందే. అనేక ఎన్కౌంటర్ ఘటనలపై మెజిస్టీరియల్, కొన్ని సంఘటనలపై న్యాయ విచారణ కమిటీలను స్థానిక ప్రభుత్వాలు నియమిస్తుంటాయి.
కానీ దిశ ఎన్కౌంటర్ ఉదంతంలో నేరుగా సుప్రీంకోర్టు విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయడం విశేషం. వాస్తవానికి ఎన్కౌంటర్లకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు తొలిసారి నేరుగా విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ విచారణలో అబ్జర్వేషన్లు అనేకం ఉండవచ్చని, వాటిని అంచనా వేయలేమని జిల్లా స్థాయి పోలీసు అధికారి ఒకరు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రజల డిమాండ్ కు తలొగ్గాల్సిన అవసరం లేదని, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను అప్పగించాలని ప్రజలు డిమాండ్ చేశారని, అంత మాత్రాన వారిని ప్రజలకు అప్పగించడం అధికారుల బాధ్యత కాబోదన్నారు. బ్యూరోక్రాట్లు కేవలం కార్య నిర్వాహకులు (ఎగ్జిక్యూషన్) మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. దిశ ఎన్కౌంటర్లో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అగ్నిలో దూకి తాము పునీతులమని బయటకు రావలసిన అవశ్యకత ప్రస్తుతం ఏర్పడిందని తాజా పరిణామాలపై ఆ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
కొన్ని ఘటనల్లో భావోద్వేగాలను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నవారికి భయం ఉండాల్సిన అవసరం కూడా ఉంటుందని ప్రముఖ న్యాయవాది ఒకరు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. జ్యుడిషియల్ కస్టడీలో గల వారిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న పరిణామ క్రమంలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిందని ఆయన ప్రస్తావించారు. ఓ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నేరుగా విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం భారత న్యాయ వ్యవస్థలోనే ప్రథమమని, ఇది అహ్వానించదగ్గ పరిణామమని కూడా న్యాయవాద ప్రముఖుడు పేర్కొన్నారు.