గౌరవనీయులైన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి…,
అయ్యా…!
నా రక్షణ కోసం మీరు చేస్తున్న కృషికి, పడుతున్న తపనకు నాలోని ప్రతి చెట్టూ, కొమ్మా, రెమ్మా, కొండా, కోనా పట్టరాని సంతోషంతో తన్మయం చెందుతున్నాయి. ఈ విషయంలో భావి తరాల మనుగడకై మీరు చేస్తున్న ప్రయత్నానికి నా గుండె నిండుగా సంబరపడుతున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మీరు నిర్వహించిన ఉద్యమానికి తెలంగాణా నలుదిక్కులా లభించిన అభినందనలు, ప్రశంసల గురించి నాకు తెలుసు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ‘వృక్షవేదం’ పుస్తకాన్నితెలుగులోనేగాక, హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ ప్రచురించినందుకు నాకు మహదానందంగా ఉంది. మీలోని పర్యావరణ ప్రేమకు నేను సైతం ఎంతో సంతోషిస్తున్నాను.
అదేవిధంగా ‘నెయిల్ ఫ్రీ ట్రీ’ ఉద్యమం తెలంగాణాలో అవసరమని కూడా మీరు అన్నట్లు వార్తల ద్వారా తెలిసింది. నా జాతికి చెందిన చెట్లకు మేకులు దింపి, నావాళ్ల తనువును నిలువునా ఛిద్రం చేస్తున్న కొందరి దుశ్చర్యలపై మీరు ఆవేదన చెందడం నాకు ఎంతో బలాన్నిచ్చింది. నా వాళ్ల శరీరాల్లోకి దించిన మేకులను తొలగించేందుకు ఉద్యమం తరహాలో మీరు కార్యక్రమం చేపట్టే యోచనలో ఉన్నారని కూడా విన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా నా జాతి రక్షణకు మీరు చేస్తున్న ఉద్యమానికి, కృషికి నేను బతికి ఉన్నంతకాలం మీకు కృతజ్ఞతా భావంతోనే ఉంటాననని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నన్ను రక్షించేందుకు మీరు చేపడుతున్న ప్రతి చర్యకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను.
కానీ, ఈ సందర్భంగా మీకో విన్నపం చేయక తప్పడం లేదు. మీరేమో నన్ను రక్షించడానికి పలు చర్యల ద్వారా పాటుపడుతుంటే, మీ పార్టీకే చెందిన ఓ ప్రజాప్రతినిధి, మీ నాయకుల మీడియాలోనే ఇంకా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న జర్నలిస్టు ఒకాయన నన్ను నిలువునా నాశనం చేస్తున్నారని చెప్పక తప్పడం లేదు. సర్కారు ఆశయాన్ని కూడా నిలువునా నరికేస్తున్నారని బాధపడక తప్పడం లేదు. ఈ విషయంలో నా బిడ్డలైన ఆదివాసీలు చేస్తున్న పోరాటం ఇప్పటికే మీ దృష్టికి వచ్చిందని కూడా భావిస్తున్నాను. ఇది ఎక్కడో కాదు… స్వయంగా మీరు కూడా పాల్గొన్న ఘటన గురించే. ‘లచ్చగూడెం-లక్ష మొక్కలు’ అనే నినాదంతో నిర్వహించిన హరితహారం కార్యక్రమం మీకు గుర్తుండే ఉంటుంది. ఔను… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంలో 2017లో నిర్వహించిన హరిత హారం కార్యక్రమం గురించే మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ముగ్గురు మంత్రులతోపాటు మీరు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో హరితహారం కింద నాటిన వేలాది మొక్కలను ధ్వంసం చేసి, అందులో రూ. కోట్ల విలువైన ఇటుకల ఫ్యాక్టరీని స్థాపించారని నా బిడ్డలు ఆదివాసీలు గత కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్నారు. ఈ దురాగతంలో మీ పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ప్రధాన భాగస్వామిగా ఉన్నట్లు ఆదివాసీ బిడ్డలు చెబుతున్నారు. అంతేకాదు ఈ మొత్తం బాగోతం వెనుక మీ నేతలకు చెందిన ‘పింక్ మీడియా’ జర్నలిస్టు ఒకాయన దళారి పాత్ర పోషించి, తన పలుకుబడితో, అధికారం అండదండతో నా ఆదివాసీల పోడు భూములను కూడా ఆక్రమించుకుని మరీ ఇటుకల ఫ్యాక్టరీని పెట్టించారట. ఈ జర్నలిస్టు గతంలో మీతో సన్నిహితంగా ఉన్నప్పటి, సీఎం కేసీఆర్ సార్ తో కలిసి ఉన్న ఫొటోలను జతపరిచి, చిత్ర… విచిత్ర మిక్సింగ్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాడు. తనకు మీ వద్ద చాలా పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నాడు. ఇది నిజమేనని నమ్మతున్న అధికారులు, స్థానిక నేతలు అతనికి వంగి, వంగి సలాములు కొడుతున్నారట. ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించరని కూడా అందరూ అనుకుంటున్నారనేది వేరే విషయం. కానీ మీతో, సీఎం కేసీఆర్ సారుతో ఏదో సందర్భంలో దిగిన ఫొటోలను నానా విధాలుగా వాడుకుంటూ మీ వంటి పెద్దల పేర్లను దుర్వినియోగం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే మీకు చేరి ఉంటాయని భావిస్తున్నాను.
కావున మిమ్మల్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నదేమిటంటే…? ‘లచ్చగూడెం-లక్ష మొక్కలు’ ద్వారా నాటిన హరితహారం మొక్కలను ఎందుకు ధ్వసం చేశారు? ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి పోడు భూముల్లో కోట్ల రూపాయల విలువైన ఇటుకల ప్యాక్టరీ పెట్టడమేంటి? గిరిజనేతరులకు ఈ ప్రాంతంలో 2017లో పట్టాలు ఇవ్వడమేంటి? భూ బదలాయింపు చట్టం (1/70 యాక్టు) చెబుతున్నదేమిటి? షెడ్యూల్డు ఏరియాలో గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులు భూ పట్టాలు ఇవ్వడంలో గల మలలబు ఏమిటి? అందులో దాగిన మర్మమేమిటి? ఇత్యాది విషయాలపై మీరు సానుకూలంగా స్పందిస్తారని, కూపీ లాగి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని, తద్వారా ‘పింక్ మీడియా’ జర్నలిస్టు, మీ పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆగడాల నుంచి నన్ను, నా ఆదివాసీ బిడ్డలకు అండగా ఉంటారని, నాకు రక్షణ కల్పిస్తారని, ఆదుకుంటారని ఆశిస్తూ…
సర్వదా కృతజ్ఞతలతో
ఇట్లు
ఇల్లెందు ‘అరణ్య’ వేదన