భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఇల్లెందు మండలం లచ్చగూడెంలో హరితహారం మొక్కల ధ్వంసం, పోడు భూముల వివాదం ఆదివాసీల పోరాటానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూముల్లో ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు గల కోట్లాది రూపాయల విలువైన ఇటుకల ఫ్యాక్టరీలో అధికార పార్టీకి చెందిన ఈ ప్రజాప్రతినిధే ప్రధాన లబ్ధిదారునిగా ప్రచారం జరుగుతోంది. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యంలో గల మంత్రి కేటీఆర్ వద్ద గతంలో మంచి మార్కులు కొట్టేసేందుకు పడరాని పాట్లు పడుతున్నట్లు వార్తల్లోకి వచ్చిన ఈ ప్రజాప్రతినిధి ఆదివాసీల పోరాటపు భూ వివాదంలో తెరపైకి రావడం గమనార్హం. వివాదానికి దారి తీసిన భూముల్లో ఇటుకల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అసలు ఆర్థిక ప్రయోజనం పొందుతున్న నాయకునిగా ప్రచారం జరుగుతోంది. ఈ వివాదాస్పద వ్యవహారంలో ‘పింక్’ మీడియాకు చెందిన జర్నలిస్టుది దళారి పాత్ర మాత్రమేనని అంటున్నారు.
లచ్చగూడెం-లక్ష మొక్కల లక్ష్యాన్ని విధ్వంసం చేసి, హరితహారం మొక్కలను నాశనం చేశారనేది అసలు వివాదం. ఆరెకరాల తమ పోడు భూముల్లో నాటిన హరితహారం మొక్కలను ధ్వంసం చేసి రూ. 2.00 కోట్ల విలువైన ఇటుకల ఫ్యాక్టరీని పెట్టారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. మొత్తం పదెకరాల భూమిని చదునుచేసి స్థాపించిన ఈ ఫ్యాక్టరీలో మెజారిటీ భాగస్వామి ఇల్లెందుకు చెందిన ఓ ప్రజాప్రతినిధిగా వార్తలు వస్తున్నాయి. అంతేగాక తన బావమరిదిని కూడా ఆయా ప్రజాప్రతినిధి ఇందులో భాగస్వామ్యం చేశారని, ఈ విషయంలో తన ‘జర్నలిస్ట్’ పలుకుబడిని ఉపయోగించి పైరవీలు చేసినందుకు పింక్ మీడియా ప్రతినిధికీ కొంత శాతం పార్టనర్ షిప్ ఇచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో లచ్చగూడెం ఆదివాసీల పోరాటం రాష్ట్రవ్యాప్త వివాదానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ రకంగా టీఆర్ఎస్ సర్కార్ కు కొత్తచిక్కులు తెచ్చెపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇల్లెందు పట్టణంలో హరితహారం కింద నాటిన ఒకటీ, అరా మొక్కలు మేసిన పాపానికే మేకల యజమానులకు, పూలు అమ్ముకుని బతికే పేదలకు వేలాది రూపాయల మొత్తాలను జరినామా విధిస్తున్న సంఘటనల నేపథ్యంలో.., ఇల్లెందు పట్టణాన్ని అనుకుని ఉన్న లచ్చగూడెంలో వేలాది సంఖ్యలో హరిత హారం మొక్కలను నాశనం చేసి ఇటుకల ఫ్యాక్టరీ స్థాపించారనే విమర్శలు సర్వత్రా చర్చకు దారి తీస్తున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఆదివాసీల పోరాటం అనేక మలుపులకు దారి తీస్తోంది. లచ్చగూడెం పోడు భూముల వివాదంపై ఆదిలాబాద్ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు ఈనెల 9వ తేదీన ఇల్లెందు పర్యటనకు వస్తుండడం విశేషం. స్థానిక ఆదివాసీల పోరాటానికి దారి తీసిన పరిణామాలను తెలుసుకునేందుకు, వారికి న్యాయంచేసే దిశగా పోరాటాన్ని తీసుకువెళ్లేందుకు బాపురావు వస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ వద్ద మంచిపేరు కోసం అదేపనిగా తహతహలాడుతున్న ఇల్లెందుకు చెందిన ప్రజాప్రతినిధి ఒకరు ఈ వివాదంతో తీవ్ర చిక్కుల్లో పడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటుకల ఫ్యాక్టరీ ఏర్పాటు చేేసేందుకు తనకు మరెక్కడా స్థలమే లభించనట్లు, హరితహారం మొక్కలను ధ్వంసం చేసి మరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం పార్టీకి తీరని నష్టదాయకంగా టీఆర్ఎస్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గిరిజన నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఆదివాసీల ప్రాబల్యం గల ప్రాంతాల్లో అధికార పార్టీకి రాజకీయంగా ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మెజారిటీ గిరిజన నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు పరాజయమే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇటువంటి వివాదాస్పద ఘటనలు పార్టీకి మరింత నష్టం కలిగిస్తాయనే వాదన వినిపిస్తోంది. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ లో ముఖ్య సూత్రధారిగా వార్తల్లోకి వచ్చిన ‘పింక్ మీడియా’ జర్నలిస్టు దురాగతాలకు సంబంధించిన బాధితులు ఇప్పటికే మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. మొత్తంగా లచ్చగూడెం హరితహారం భూముల వివాదం ఇల్లెందులోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మెడకు చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.