‘మా ఇంటికొస్తే ఏం తెస్తారు…? మీ ఇంటికొస్తే ఏమిస్తారు…?’ ఇదో సామెత. ఇదే టైటిల్ తో ఆ మధ్య ఓ సినిమా కూడా వచ్చింది లెండి. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే… తెలంగాణా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ‘ఏకగ్రీవం’ అనే సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో ఏ సంప్రదాయమైనా ఉండొచ్చు… నల్లగొండ జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా పెడదామని నేను విన్నవించాను. నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే రాగ్యానాయక్ చనిపోయినపుడు ఈ సంప్రదాయం పెట్టుకున్నాం. ఆయన భార్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగాలనేది’ తన అభిప్రాయంగా గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
నిజమే మండలి చైర్మెన్ సుఖేందర్ రెడ్డి అభిప్రాయాన్ని కాసేపు గౌరవించాల్సిందే. కానీ ఏకగ్రీవం అనే సంప్రదాయం గురించి రాజకీయంగా చర్చించే ముందు అనేక అంశాలు గుర్తుకువస్తుంటాయి. గిరిజనుడైన రాగ్యానాయక్ ను నక్సలైట్లు చంపిన సమయంలో భారీ ఎత్తున ఆయన కుటుంబంపై సానుభూతి ఏర్పడింది. నక్సలైట్ల దుశ్చర్యను పలువురు నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు అప్పట్లో ఏకగ్రీవ ఎన్నికకు అంగీకరించవచ్చు. కానీ ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మొన్నటికి మొన్న దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ నేతల నోటి నుంచి ‘ఏకగ్రీవం’ సంప్రదాయపు మాట రాకపోవడం విశేషం. సుఖేందర్ రెడ్డి వంటి సీనియర్ నేత వ్యాఖ్య ప్రకారం ఏకగ్రీవం సంప్రదాయం నల్లగొండ జిల్లా వరకే పరిమితమని తాను భావించవచ్చు. కానీ ఇదే సంప్రదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాటించినా సత్సంప్రదాయమే అవుతుంది. కానీ పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా ఏం జరిగింది? అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన వైఖరి, విధానం ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి.
ప్రజాభిమానం పెనవేసుకున్న నేతగా ప్రాచుర్యం పొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యే హోదాలో అనారోగ్యం పాలై మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెతోపాటు కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ ను కలిసి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే, సీఎంవో వర్గాలు ఇందుకు నిరాకరించాయని కాంగ్రెస్ నేతలు అప్పట్లో తెలిపారు. అంతేకాదు సుచరితారెడ్డి కూడా సీఎంకు లేఖ రాశారు. వెంకటరెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఈమేరకు అసెంబ్లీలో తీర్మా నం కూడా చేశారని అందులో గుర్తుచేశారు. ఆయన ఆశయాల మేరకే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, సహృదయంతో ఏకగ్రీవం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సీఎం నుంచి సానుకూల సందన రాలేదని, దీంతో ఆమె నేరుగా సీఎంవోకు వెళ్లినా అనుమతి ఇవ్వలేదని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ప్రకటించకముందే సీఎంను కలిసేందుకు సుచరిత, ఆమె కుటుంబసభ్యులు, జిల్లా ముఖ్య నేతలు, టీపీసీసీ నేతలు సీఎంవోను కోరారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఆమె ఏకగ్రీవానికి మద్ధతు తెలిపాయి. అయితే కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుంచి రాగానే పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల పేరును ప్రకటించడం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తయితే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డిని ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అర్ధబలం, అంగబలం సహా తన శక్తియుక్తులన్నింటినీ పాలేరులో మోహరించడం గమనార్హం. మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే, వీధికో నాయకుడు, ఇంటికో కార్యకర్త చొప్పున రాష్ట్రం నలుమూల నుంచీ పార్టీ శ్రేణులను దింపి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణిని ఓడించారు. అప్పటికే ఎమ్మెల్సీగా, మంత్రిహోదాలో గల తుమ్మల గెలుపుకోసం ఓ మహిళను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ‘ఏకగ్రీవం’ సంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు పాలేరు ఉప ఎన్నికనాటి దృశ్యాన్ని ఈ సందర్భంగా మరీ మరీ గుర్తు చేస్తున్నాయి. సుచరితారెడ్డి ‘రాజకీయ వ్యథ’లో కొసమెరుపు ఏమిటంటే రాంరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ జిల్లాతోనూ విడదీయలేని కుటుంబ బాంధవ్యం, అనుబంధం ఉండడం.