‘మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె’ అంటే ఇదే కాబోలు. వైద్య చికిత్స కోసమో, పెళ్లికో, పేరంటానికో, అవసరానికో, అత్యవసరానికో అప్పు చేయడం సహజం. అప్పునకూ అర్థం, పరమార్ధం ఉండాలి అంటుంటారు. కానీ ఈ మహానుభావుడెవరో ఏకంగా ‘31 డిసెంబర్ దావత్’ కోసం ప్రామిసరీ నోట్ రాసిచ్చి మరీ అప్పు చేయడమే అసలు విశేషం. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఇదే తరహాలో అప్పు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రామిసరీ నోటులోని వివరాల ప్రకారం… మిర్యాగలగూడ మండలం ఉట్లపల్లికి చెందిన బత్తిని సతీష్ అనే వ్యక్తి అదే మండలం తక్కళ్లపాడుకు చెందిన రాతూరి అంజివద్ద నిన్న అప్పు చేయాల్సి వచ్చింది. ఈ అప్పు అవసరం ఏమిటో ముందే చెప్పుకున్నాం కదా! 31 డిసెంబర్ రోజున ‘దావత్’ కోసం ఓ పదిహేను వేల రూపాయల అప్పు తీసుకుంటూ ప్రామిసరీ నోట్ కూడా రాసిచ్చాడు. అందుకు రూ. 1.50 వడ్డీ కూడా చెల్లిస్తానని ‘నోట్ మాట’గా రాసిచ్చాడు.
అప్పు అన్నాక ఆ మాత్రం ‘రాత’ పత్రం ఉండాలి కదా మరి. అందుకే ప్రామిసరీ నోట్ రాసిన దస్తూరి సహా ఆరుగురు సాక్షులుగా రెవెన్యూ స్టాంపుపై దస్కత్ (సంతకం) చేసి మరీ సతీష్ రాసిచ్చిన ప్రామిసరీ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ‘దావత్’ అప్పు ఒప్పందం ఆయా వ్యక్తుల మధ్య నిజంగానే జరిగిందా? లేక పబ్లిసిటీ స్టంటా? అనే అంశంపై మాత్రం క్లారిటీ లేకపోవడం కొసమెరుపు.