ఔను… తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ తన మనసు మార్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియంత్రితసాగు, ఎల్ఆర్ఎస్ వంటి అంశాల్లోనే కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఓ పథకంపైనా తన గత వ్యాఖ్యలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా సహా 1,393 జబ్బులకు ఉచితంగా చికిత్స లభించే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంపై సీఎం కేసీఆర్ గతంలో ఏమన్నారో గుర్తుందిగా? ఎప్పుడో కాదు గత సెప్టెంబర్ నెలలోనే జరిగిన తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోన ఆయుష్మాన్ భారత్ పథకంపై కేసీఆర్ విమర్శలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం దండగ అనే విషయాన్ని తాను ప్రధాని నరేంద్ర మోదీ ముఖం మీదే చెప్పానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ వల్ల మేలు కలుగుతోందని కూడా ఆయన అన్నారు. తాము ఈ విషయాన్ని చాటుగా చెప్పలేదని, ప్రధాని ముఖం మీదే చెప్పానని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేస్తోందనే విషయం వారికి తెలుసో, తెలియదోనని కూడా కేసీఆర్ అన్నారు.
అయితే తాజాగా ఈ పథకంపై సీఎం మనసు మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కు అనుసంధానించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సీఎస్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్ లో ప్రకటించింది. దేశంలో ఎక్కడైనా సరే ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రూ. 5.00 లక్షల వరకు ఉచిత వైద్యం తీసుకునేందుకు ఈ పథకం అవకాశాన్ని ఇస్తోంది. కానీ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గడచిన రెండేళ్లుగా విముఖతను ప్రదర్శించారు. పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నుంచి లేఖలు అందినా, పలువురు కేంద్ర మంత్రులు స్వయంగా కోరినా సీఎం కేసీఆర్ నిరాకరించారు. ఆయుష్మాన్ భారత్ ను దండగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ తాజాగా అదే పథకంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం సహజంగానే చర్చకు దారి తీసింది.
ఫీచర్డ్ ఇమేజ్: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ కలిసినప్పటి దృశ్యం (ఫైల్ ఫొటో)