మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అభినందించారు. మావోయిస్టుల అణచివేతలో మహబూబాబాద్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన సందర్భంగా డీజీపీ అభినందనను ఎస్పీ కోటిరెడ్డి అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి నెత్తురు బొట్టు చిందించకుండా, నక్సల్స్ ను జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తూ, వారి కుటుంబాలను కలుస్తూ, వారికి తోడుగా నిలుస్తూ వచ్చారు.
మావోయిస్టు కార్యకలాపాలను ఎక్కడికక్కడ అణచివేస్తూ జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను జరుగకుండా జిల్లాలో శాంతి స్థాపనకు కృషిచేశారు. ఇందుకు గుర్తింపుగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మానుకోట ఎస్పీ కోటిరెడ్డికి రివార్డ్ అందచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ , మహబూబాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా నిరంతరం కృషి చేశామన్నారు. తమకు అన్నివేళలా సహాయ, సహకారాలు అందిస్తున్న జిల్లా ప్రజలకు ఎస్పీ కోటిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.