నియంత్రిత సాగు విధానంపై ‘యూ టర్న్’ తీసుకున్నప్పటికీ కేసీఆర్ సర్కార్ పై రైతులు వినూత్న రీతిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, రైస్ మిల్లరో, దాల్ మిల్లరో అంతకంటే కాదని, పంటల కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదని ప్రభుత్వం స్వయంగా ప్రకటించినప్పటికీ తెలంగాణా రైతాంగం మహదానందంగా ఉంది… ఎందుకో తెలుసా? రైతు బంధు డబ్బు బ్యాంకు ఖతాలో పడిందనే సంతోషంతో ‘సర్కార్’పై కర్షకులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారుట. నమ్మడం లేదా?
అయితే ఫొటోను మరోసారి నిశితంగా పరిశీలించండి. ఈ దృశ్యం జనగామ జిల్లా సిద్దెంకి గ్రామంలోనిదట. సోమవారం రైతుబంధు డబ్బులు ఇలా బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో… అలా… ఆ విషయం పొలంలో నాట్లు వేసుకుంటున్న రైతులకు, వ్యవసాయ కూలీలకు వెంటనే తెలిసిపోయింది. బహుషా ఈ కూలీల, రైతుల సెల్ ఫోన్లకు మెసేజ్ వచ్చింది కాబోలు. అంతే బురదమడిలోనూ రైతులు, వ్యవసాయ కూలీలు ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఇంకేముంది… నాట్లు వేసుకునేవారు తమ పనులను కాసేపు ఆపి, నారు కట్టలను ఇలా ‘రైతు బంధు’ అనే అక్షరాలతో పేర్చి ప్రభుత్వ విధానంపై పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ అద్భుత దృశ్యాన్ని ఎవరో ప్రపంచానికి చూపడం లేదు. సాక్షాత్తూ టీఆర్ఎస్ వీరాభిమానులే సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు ‘ఇదేరా బత్తాయిలూ…కేసీఆర్ మీద రైతులకు ఉన్న ప్రేమ’ అంటూ కామెంట్ తగిలించి మరీ. ఇంతకీ ఈ పొటో వానాకాలం నాట్లదా? ప్రస్తుత యాసంగి సీజన్ బాపతా? అని మాత్రం అడక్కండి… ఎందుకంటే ఆ విషయంపై క్లారిటీ లేదు. అదీ సంగతి.