నియంత్రిత సాగుపై తెలంగాణా ప్రభుత్వం చేతులెత్తేసింది. కారణాలు ఏవైనా కావచ్చు… పంట సాగుపై రైతులే నిర్ణయం తీసుకోవచ్చని అధికారగణం అభిప్రాయపడింది. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అధికారుల అభిప్రాయం’ పేరున అధికారిక ప్రకటన వెలువడడం విశేషం. ఆయా ప్రకటన ప్రకారం…
‘‘ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నది. ఈ రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలి. తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. ఈ విధానం ఉత్తమం’’ అని సమావేశంలో విస్తృత అభిప్రాయం వ్యక్తమైంది.
కాగా ఈనెల 28వ తేదీ, సోమవారం నుంచి వచ్చే జనవరి నెల వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మొత్తం 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ. 7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దు తిరుగుడు పువ్వు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు.