యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా మన దేశాన్ని కూడా వణకిస్తోంది. కొత్తరకం కరోనా అంశంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి నుంచే ముంబయి సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
మహారాష్ట్ర దారిలోనే కర్నాటక ప్రభుత్వం కూడా పయనిస్తోంది. కొత్తరకం కరోనాను కట్టడి చేసేందుకు కర్నాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో పలువురికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో బహిర్గతమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందస్తుగా కర్ఫ్యూ నిర్ణయం తీసుకుంటున్నాయి.