‘చావు కబురు చల్లగా చెప్పడం’ అంటే ఏమిటో తెలుసా? దేశ ప్రజానీకం రూ. 250 కోట్ల మొత్తానికి పైగా జేబులు ఖాళీ చేసుకున్నాక అసలు విషయాన్ని వెల్లడించడం అన్నమాట. మన దేశీయ కంపెనీ ‘పతంజలి’ ఉత్పత్తుల ప్రాచుర్యం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత అనతికాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఖండాంతరాలుగా విస్తృత పర్చుకోవడంలో పతంజలి సంస్థ భారీ ఆదాయాన్నే సముపార్జించుకుంది. పతంజలి సంస్థ మిగతా ఉత్పత్తుల సంగతి ఎలా ఉన్నప్పటికీ, కరోనాకు సంబంధించి చెట్టూ, చేమల పదార్థాలతో తయారు చేసిన గోళీల మాటున కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టినట్లు స్పష్టమవుతోంది. ఇది ఎవరో ప్రత్యర్థి వ్యాపార సంస్థలు చేస్తున్న ఆరోపణలు కావు. సాక్షాత్తూ యూకే (యునైటెడ్ కింగ్ డమ్)లోని బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలిన ఫలితపు అంశం.
ఇంతకీ విషయమేమిటంటే… మన ప్రఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన దేశీయ ఉత్పత్తుల దుకాణం ‘పతంజలి’ సంస్థ తెలుసుగా…! ఈ ఆయుర్వేద సంస్థ ఆ మధ్య ‘స్వసారి కరోనిల్’ అనే కరోనా కిట్ ను తయారు చేసింది. కరోనా మహమ్మారిని తాము రూపొందించిన ఈ కిట్ తరమేస్తుందని కంపెనీవారు ‘టాం టాం’ చేశారు. ఇంకేముంది మన జనం ఎగబడ్డారు. గోదావరిలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆసరా దొరికినా పట్టుకుంటాడనే సామెతకు అనుగుణంగా, కరోనా సృష్టించిన కల్లోలంతో భీతావహానికి గురైన సగటు భారతీయుడు పతంజలి కరోనా కిట్లను ఆవురావురుమంటూ కొనేశారు. సంస్థ చెప్పిన లెక్కల ప్రకారమే అక్షరాలా రూ. 250 కోట్ల విలువైన 25 లక్షల కిట్ల గోళీలను కొని ఉదరంలోకి తోసేశారు. ఈ మొత్తం గత అక్టోబర్ వరకు మాత్రమే.
గత జూన్ 23న ఆవిష్కరించి, విడుదల చేసిన నాలుగు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు కరోనిల్ కిట్లను క్రయం చేయడం గమనార్హం. అంటే సగటున నెలకు రూ. 60 కోట్ల వరకు పతంజలి సంస్థ కరోనా కిట్లను కొనుగోలు చేశారన్నమాట. ఈ లెక్కన నవంబర్, డిసెంబర్ నెలల వ్యాపార లావాదేవీలను కూడా కలిపితే పతంజలి సంస్థ సొమ్ము చేసుకున్న కరోనా కిట్ల మొత్తాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆశ్చర్యపోయే అంశమేమిటంటే.. అసలు ఈ కరోనా కిట్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని యూకేలోని బర్మింగ్ యూనివర్సిటీ తన పరిశోధనలో తేల్చేసింది. కేవలం వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందించిన ‘కరోనిల్’ కిట్టుకు కరోనాను ఎదుర్కునే సామర్ధ్యం లేదని పరిశోధనలో తేలినట్లు తాజా వార్త. కనీసం రోగ నిరోధక శక్తిని పెంచేది కూడా ‘కరోనిల్’లో అస్పష్టమేనని ఆయా యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ మేత్రేయి శివకుమార్ వెల్లడించినట్లు తాజా వార్తల సారాంశం.
అంతేకాదు.. పతంజలి సంస్థ తయారు చేసిన స్వసారి కరోనిల్ కిట్ల విక్రయానికి యూకేలో అనుమతి కూడా ఇవ్వలేదని బ్రిటిష్ వైద్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. అనుమతి లేని ఔషధాలను, ఉత్పత్తులను యూకే మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆ సంస్థ హెచ్చరించింది. అయితే వందల కోట్ల రూపాయలను కిట్ల విక్రయం ద్వారా పతంజలి సంస్థ సొమ్ముచేసుకున్న దాదాపు ఆరు నెలల తర్వాత ఈ విషయం వెల్లడి కావడం అసలు విషాదం.