మన తెలుగు మీడియా ‘పవర్’ తెలిసిందే కదా? మేం తల్చుకుంటే ఏదైనా సాధించగలం అనే ధీమా! దర్శకుడు కృష్ణవంశీ తీసిన రాఖీ సినిమాలో బ్రహ్మానందం విసిరిన ‘మేక్ ద రూల్, బ్రేక్ ద రూల్’ డైలాగ్ టైపు పవర్ ఉందని భ్రమించే భావన. ఇంతటి శక్తియుక్తులు గల తెలుగు మీడియా ఇటీవలి కాలంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఉదయాన్నే వాట్సాప్ గ్రూపుల్లో సంచారం చేస్తోంది. ఈ విషయంలో చిన్నా, పెద్దా అనే తేడా ఏమీ లేకపోవడమే అసలు విశేషం. తమకు బోలెడంత సర్క్యులేషన్ ఉందని వాదించే ప్రింట్ మీడియా ప్రతినిధులే కాదు, బార్క్ రేటింగ్ బడాయికి పోయే ఎలక్ట్రానిక్ మీడియాది కూడా ఇదే దారి.
ఇంతకీ విషయమేమిటంటే… మన తెలుగు పత్రికల పరిస్థితి, న్యూస్ ఛానళ్ల తాజా గమనం గురించి కొత్తగా చెప్పుకునేది కూడా ఏమీ లేదు. కరోనా ధాటికి అన్ని రంగాలతోపాటు మీడియా కూడా కుదేలైంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ చందంగానే కాలం గడిపే దుస్థితి. తమకు ఇంత సర్క్యులేషన్ ఉందని ఢంకా భజాయించి చెప్పుకునేందుకు కూడా ఏ పత్రికా పెద్దగా సాహసించడం లేదు. ఎందుకంటే ఏబీసీ సర్టిఫికెట్ ను చూపాల్సి ఉంటుంది మరి. ఇక న్యూస్ ఛానళ్ల బార్క్ బాగోతంపై ఎప్పటికప్పుడు మాల్ ప్రాక్టీస్ దందాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ జాతీయ న్యూస్ ఛానల్ బార్క్ రేటింగ్ బాగోతంపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది.
ఇటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు తెలుగు మీడియా సంస్థలు కొన్ని పడరాని పాట్లు పడుతున్నాయి. అనేక అపసోపాలను ప్రదర్శిస్తున్నాయి. ప్రింట్ మీడియాకు చెందిన పలు పత్రికలు తమ ఈ-పేపర్ లను ఉదయాన్నే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నాయి. ప్రింట్ మీడియాగా ప్రాచుర్యంలో మాత్రమే గల మరికొన్ని పత్రికల యాజమాన్యాలు అసలు ప్రింటింగ్ జోలికే వెళ్లకుండా ‘ఆన్ లైన్’ ఎడిషన్లకే పరిమితమై, వాటి లింకులను తమ ప్రతినిధుల ద్వారా వాట్సప్ గ్రూపుల్లోకి నెట్టిస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా తక్కువేమీ తినలేదు. జర్నలిజంలో తాము మాత్రమే తోపులమని భావించే సీనియర్లు కూడా చివరికి తమ వార్తా కథనాల యూ ట్యూబ్ లింకులను వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేస్తున్నారు.
ఫలితంగా అటు ప్రింట్ మీడియా, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులు వాట్సాప్ గ్రుపులే తమకు అసలైన ‘ప్లాట్ ఫాం’గా భావిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలకు కూడా ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు సుమీ. అంటే… కరోనా పరిణామాల్లో అటు ప్రింట్ మీడియా, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాపట్ల పాఠకుల, వీక్షకుల ఆదరణ స్థితిగతులను అవగతం చేసుకోవచ్చన్నమాట. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న లింకులే ప్రామాణికంగా తెలుగు మీడియా సంచార గమనం తీరుతెన్నులు మీకు బోధపడుతున్నట్లే కదా!