ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకే కదా…పోలీసు శాఖ డయల్ 100 అనే నెంబర్ ఏర్పాటు చేసింది? దిశ హత్యోదంతం ఘటన సందర్భంగా మన హోం మంత్రి మహమూద్ ఆలీ సార్ చెప్పింది కూడా ఇదే కదా? దిశ తన చెల్లెలికి కాకుండా డయల్ 100కు ఫోన్ చేస్తే బాగుండేదనే కదా హోం మంత్రి సార్ చెప్పింది. సరే దిశ ఘటనలో హోం మంత్రి మహబూద్ ఆలీ సాబ్, మరో మంత్రి తలసాని శీనన్న, తాజాగా కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ శోభ చేసిన కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెట్టండి.
డయల్ 100 కు ఓ ఫోన్ వచ్చిందే తడవుగా బ్లూ కోట్స్ పోలీసు ఒకాయన పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఎవరో ఆపదలో ఉన్నారని, రక్షిద్దామని క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లి, ‘నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?’ అని బ్లూ కోట్స్ పోలీసన్న ఫోన్ చేసిన వ్యక్తిని ప్రశ్నించాడు. తనకు వచ్చిన ఆపద ఏమిటో ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన విషయాన్ని విని బ్లూ కోట్స్ పోలీసన్నకు ఏం చేయాలో పాలు పోలేదు. కాసేపు తల నిమురుకున్నాడు. ఇంతకీ డయల్ 100 అనే నెంబర్ కు ఈ ప్రబుద్ధుడు ఏ ఆపద గురించి ఫోన్ చేశాడో తెలుసా? మేకలు కాయడానికి తన తమ్ముడు వెళ్లడం లేదని. అదీ సంగతి. నువ్వు ఫోన్ చేసింది ఈ ఆపద కోసమే కదా? అని బ్లూ కోట్స్ పోలీసు ఫోన్ చేసిన ప్రబుద్ధుడిని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనేది తెలియరాలేదు. ఆ వీడియోను దిగువన చూడండి.