‘‘షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? హైదరాబాద్ కు కేసీఆర్, ఢిల్లీకి బండి సంజయ్… అసలేం జరుగుతోంది.?
ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన… వెంటనే బండి సంజయ్ కు పిలుపు, మర్మమేంటో?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేతలను బండి సంజయ్ కలవనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను సీఎం కేసీఆర్ కలిసిన నేపథ్యంలో… బండి సంజయ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకోనుంది.
ఇవీ తెలుగు మీడియా తాజా కథనాలు. ఇవేవీ సోషల్ మీడియా హెడ్డింగులు, క్తుప్త కథనాలు కావు సుమీ. బాధ్యత గల మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతోపాటు తెలుగు మీడియాలోని ప్రముఖ పత్రికకు చెందిన వెబ్ సైట్లు ప్రచురించిన వార్తా కథనాల శీర్షికలు, సంక్షిప్త సమాచారం. ఔను నిజమే… బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. కానీ ఎందుకు వెళ్లారు? ఎవరో తాడూ, బొంగరం లేని వ్యక్తి ఇటువంటి కథనాలు అల్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కనీస బాధ్యత ఉండాలి కదా? ఇదీ బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడి ప్రశ్న.
అతని ప్రశ్నలో అర్థముంది కదా? బాధ్యతాయుత జర్నలిజమంటే ఏమిటి? అసలేం జరిగిందో కనుక్కోవడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విస్తృత రిపోర్టింగ్ నెట్ వర్క్ ఉంటుంది. బీజేపీ పార్టీ ‘బీట్’ చూసే రిపోర్టర్ నేరుగా బండి సంజయ్ కే ఫోన్ చేసి ఢిల్లీ వెళ్లడానికి గల కారణమేంటో కనుక్కునే అవకాశం ఉంది. చిన్నా, చితకా మీడియా సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రధాన, ప్రముఖ సంస్థల విలేకరుల ఫోన్లకు రాజకీయ నాయకులు స్పందించడం సహజమే. కానీ విషయం కనుక్కోకుండానే… సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లో విమానం దిగకముందే బండి సంజయ్ కు బీజేపీ అగ్రనేతల నుంచి పిలుపు వచ్చిందంటూ వార్తా కథనాలు వెలువడడం గమనార్హం.
ఇంతకీ బండి సంజయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా? అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో ఉంది. ఈ స్టాండింగ్ కమిటీలో సంజయ్ సభ్యుడు. అందువల్ల ఆయా సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే సంజయ్ ఢిల్లీ వెళ్లారట. అదీ అసలు విషయం. అయినా ప్రధాన మంత్రి మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు మరే ఇతర పనులేమీ లేవా? కేసీఆర్ వెళ్లి కలవగానే సంజయ్ ను పిలిచి మంతనాలు జరిపేంత తీరికగా ఆయా అగ్రనేతలు ఉన్నారా? అని బీ.జేపీ సీనియర్ నాయకుడొకరు సూటిగానే ప్రశ్నించారు.