ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణా సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను ఇప్పటికే కలిసిన సీఎం నేడు ప్రధానమంత్రి మోదీతోనూ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య సుమారు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో సీఎం చర్చించినట్లు సమాచారం.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిల అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన పరిస్థితులను, నిధుల విడుదల అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.