మరో నెల రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. దిక్కుతోచని ఆర్థిక దుస్థితిని తలచుకుని ఆ కుటుంబం తీరని ఆవేదనకు లోనైంది. గత్యంతరం లేక ఆ కుటుంబంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ ప్రాంతంలో గత అర్థరాత్రి సమయంలో చోటు చేసుకున్న విషాదమిది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఈ ఘోర ఘటనకు ఆర్థిక ఇబ్బందులే దారి తీసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెడితే… ఖమ్మం నగరంలోని రాఘవ మహల్ థియేటర్ ప్రాంతంలో నివసించే ప్రకాష్ మానుకోటలో స్వర్ణకార పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రకాష్ పెద్ద కుమార్తెకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. వచ్చే జనవరి 11న వివాహం జరగాల్సి ఉంది. ప్రకాష్ బంగారం షాపులో పని చేస్తుండగా ఆయన భార్య గోవిందమ్మతోపాటు ఇద్దరు కుమార్తులు కూడా టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వివాహ తేదీ సమీపిస్తుండడం, చేతిలో డబ్బు లేకపోవడంతో ప్రకాష్ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
దీంతో గత రాత్రి 11 గంటల ప్రాంతంలో బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి ప్రకాష్ భార్య గోవిందమ్మ (49), కుమార్తెలు రాధిక (29), రమ్య (28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో పలువురిని కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.