ఫొటో చూశారుగా…! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలిచినందుకుగాను టీఎన్జీవో రాష్ట్ర నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను, జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ను కలసి అభినందనలు తెలిపిన దృశ్యమిది. ఏలూరి శ్రీనివాసరావు బండి సంజయ్ ని కలిసిన సందర్భంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తదితరులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఇదీ బండి సంజయ్ కు ఏలూరి శ్రీనివాసరావు అభినందన ఫొటోకు సంబంధించి క్లుప్త కథనం. కానీ ఈ ‘అభినందన కలయిక’ వెనుక అసలు ‘కత’ వేరు.
ఇంతకీ ఎవరీ ఏలూరి శ్రీనివాసరావు? తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ వంటి ఎన్జీవో నాయకుల సరసన ప్రాచుర్యం పొందిన ఎన్జీవో నాయకుడు. తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా టీఎన్జీవో హౌజింగ్ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. ప్రస్తుతం కూడా ఈయన ఇదే పదవిలో ఉన్నారు. అధికారిక హోదా ప్రకారం ‘ఏలూరి’ ఎంపీడీవో. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, చండ్రుగొండ, అశ్వాపురం ఎంపీడీవోగా పనిచేశారు. ఇటీవలే నారాయణపేట జిల్లాకు బదిలీకి గురై నాన్ ఫోకల్ పోస్టులో నియమకమయ్యారు. అదేమిటి… ఎన్జీవో సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఓ ఉద్యోగ నంఘ నేతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నుంచి ఎక్కడో గల నారాయణపేట జిల్లాకు బదిలీ చేయడమేంటి? అని ఆశ్యర్యపోకండి. అక్కడే ఉంది అసలు కథ… రాజకీయ వ్యథ.
ఉద్యోగ సంఘ నేతగా ‘ఏలూరి’ సీఎం కేసీఆర్ సార్ కు కూడా తెలుసు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు అనుయాయునిగా ప్రాచుర్యం పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావుకు మద్ధతు తెలిపారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలు అందరికీ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు తెలిసిందే. ఇప్పుడీ ‘ఏలూరి’ బండి సంజయ్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓ ప్రభుత్వ ఉద్యోగి అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్న కాషాయ పార్టీ నేతలను కలవడమేంటి? అందుకు దారి తీసిన పరిణామాలేమిటి? ఇదీ తాజా చర్చ.
ఏలూరి శ్రీనివాసరావు వాదన ప్రకారం… తనను రాజకీయ కక్ష వెంటాడుతోంది. ప్రతీకరేచ్ఛతో రగలిపోతున్న ‘రాజకీయం’ అడుగడుగునా వేధిస్తోంది. రాజకీయ ఆరోపణలతో కేసుల మీద కేసులు నమోదు చేయిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే అకారణంగా తరచూ బదిలీకి గురవుతున్నారు. ఎక్కడి అశ్వాపురం? మరెక్కడి నారాయణపేట జిల్లా. కేవలం తుమ్మల, నామా నాగేశ్వరరావులకు మద్ధతు తెలిపినందుకే తనను రాజకీయంగా వెంటాడి, వేధిస్తున్నారనేది ఏలూరి శ్రీనివాసరావు బాహాటంగానే చేస్తున్న ఆరోపణ. తనపై నమోదువుతున్న కేసులపై ఆయన చట్టపరంగానే పోరాడుతున్నారు. కానీ ఇంతగా వేధింపులకు గురవుతున్న తాను ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని కూడా ఏలూరి శ్రీనివాసరావు ఇటీవలే తేల్చి చెప్పారు. రాజీనామా చేస్తానని, అటో, ఇటో తేల్చుకుంటానని కూడా ప్రతిన బూనారు. తన కుటుంబ విషయాల్లోనూ ‘రాజకీయం’ కక్ష సాధిస్తోందని, పిల్ల ల భవిష్యత్తుపైనా పావులు కదుపుతున్నారనేది ఏలూరి తన అనుయాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. చివరికి పిల్లల పెళ్లి సంబంధాల విషయంలోనూ ‘రాజకీయం’ వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటువంటి ‘రాజకీయం’తో అమీ, తుమీకే సిద్ధపడుతున్నట్లు ఏలూరి స్పష్టంగానే చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ఏలూరి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నిన్న కలిశారు. జీహెచ్ఎంసీలో బీజేపీ సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కలయిక ‘అభినందన’ వరకే పరిమితమైంది. ఉద్యోగానికి తన రాజీనామా ఆమోదం కాగానే ఆయన కాషాయ జెండా కప్పుకోనున్నారు. అంటే బాహాటంగానే ‘ఏలూరి’ రాజకీయాల్లోకి వస్తున్నారన్నమాట. సామాజికపరంగానూ ఖమ్మం జిల్లా రాజకీయాలకు ‘ఏలూరి’ సూట్ అవుతారని, తమ పార్టీకి ఉపకరిస్తారని బీజేపీ నేతలు భావిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ‘ఏలూరి’కి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ గట్టి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం ఖిల్లాపై రాజకీయంగా ఇప్పటి వరకు పెద్దగా ‘పట్టు’లేని కాషాయపార్టీకి ‘ఏలూరి’ వంటి ఉద్యోగ సంఘ నేత అభినందనలు లభించడానికి దారి తీసిన పరిణామాలు, పరిస్థితులు ఏమిటి? ఇదీ జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తాజా రాజకీయ చర్చ.