బీజేపీ విసిరిన వలలో తెలంగాణా సీఎం కేసీఆర్ చిక్కుకున్నారా? తన రాజకీయ చతురతతో ఉద్దండులను సైతం బోల్తా కొట్టించిన కేసీఆర్ అక్కడే పప్పులే కాలేశారా? అక్కడితో ఆగితే ప్రస్తుతం కేసీఆర్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదా? ఈ సందేహాలను సృశిస్తూ ఓ ఆంధ్రుడు సోషల్ మీడియా వేదికగా రాసిన పోస్ట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టును భావ వ్యక్తీకరణ దెబ్బతినకుండా, భాషను మాత్రమే సవరించి మీ కోసం… దిగువన చదివేయండి.
కరెక్ట్ గా రెండు సంవత్సరాల కింద కేవలం ఒక్కటి అంటే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఈ రోజు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎలా అవతరించింది? అందులో కూడా మహామహులు అనుకున్న వారు ఓడిపోతే కూడా కేవలం ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవటమే ఒక చరిత్ర అయితే, ఈ రోజు తెలంగాణ రావటానికి ప్రధాన కారణమైన టీఆర్ఎస్ ను కూడా ఈ రోజు వణికించే అంత బలం బీజేపీకి ఎలా వచ్చింది ??
దీనిని అర్ధం చేసుకోవాలి అంటే రెండు సంవత్సరాల ముందుకు వెళ్లి కొద్దిగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
2019 ఎన్నికలలో అప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల మోడీ ప్రభ దేశంలో క్షీణిస్తోందని అంచనా వేసిన కేసీఆర్, అప్పటికే తనకు రాష్ట్రంలో ప్రధాన అడ్డంకి అయిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సెంట్రల్ లో అధికారంలోకి వస్తుందో అన్న ఉద్దేశంతో మోడీతో కలిసి ఒక ప్రణాళిక రచించటం మొదలు పెట్టారు.
అదే ముందస్తు ఎన్నికలు…
అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న కేసీఆర్ సార్ కు అప్పట్లో ముందస్తు ఎలక్షన్స్ లోకి పోవాల్సిన అవసరం ఏ కోశానా కూడా లేదు. అయినప్పటికీ తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో బీజేపీతో చేతులు కలపటం జరిగింది.
రాజకీయాలలో ఉద్దండులను సైతం బోల్తాకొట్టించిన గండరగండడు కేసీఆర్ మొదటిగా పప్పులో కాలు వేసింది ఇక్కడే…
దీనికిగాను కేంద్రంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒక గూటికి చేరకుండా తృతీయ ఫ్రంట్ అని చెప్పి కొంత గందరగోళం సృష్టించటం కేసీఆర్ పని. అదే చేశారు.
అక్కడితో ఆగితే కీసీఆర్ కు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
అలా వదిలి వేయటానికి అదేమీ మాములు పార్టీ కాదు… బీజేపీ. దాని వలలో చిక్కింది గండరగండ కేేసీఆర్ అయినా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన బోబోరు అయినా ఒక్కటే. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టదు.
అనగా… అంతో ఇంతో చచ్చీ, చెడీ సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్, మిగతా పార్టీల సభ్యులను తన పార్టీలో కలిపేసుకుని రాజకీయంగా తన గొయ్యిని తానే తవ్వుకునే విధంగా కేసీఆర్ ను ప్రేరేపించారు.
ఎంత తెలివి కలిగిన వాడైనా ఒక్కోసారి చాలా సిల్లీ తప్పుకు బలవుతారు. ఇక్కడ జరిగింది అదే.
తెలంగాణాలో ఇంక ఎవరికి ఓటు వేసినా అది దండగే, వారు మళ్ళీ పోయి టీఆర్ఎస్ లో చేరుతారనే భావన ప్రజలలో తీసుకురావటంలో బీజేపీ వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు.
ఇక అపుడు బీజేపీ వాళ్ళు అసలు ప్రణాళిక మొదలు పెట్టారు. అప్పటికే మిగతా పక్షాలని నమ్మటం మానేసిన ప్రజలకు తమ తరపున గోడు చెప్పుకోటానికి బీజేపీ అయితేనే మంచిది అనే విధంగా ప్రజలలో ఒక భావన ప్రబలేలా ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఇక ఎవరికి వేసినా ప్రయోజనం లేదు బీజేపీ అయితేనే కేసీఆర్ అహంకారానికి అడ్డుకట్ట పడుతుంది అని క్రమంగా బీజేపీ వైపు మొగ్గారు.
కేవలం తెలంగాణలో తమ పార్టీ, మరీ ముఖ్యంగా తమ కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలి అనే స్వార్థంతో కేసీఆర్ చేసిన ఒక చిన్న పొరపాటు ఈ రోజు అతనికే శాపం అయింది.
ఇది నా వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే… ఇదే నిజం అవ్వాలి అని రూల్ ఏమీ లేదు.
నా అభిప్రాయాన్ని ఆత్మీయులైన మీతో పంచుకోవాలి అనిపించింది. నిజం అనిపిస్తే సరి. ఒకవేళ లేదు అనుకుంటే వదిలేయండి తప్ప దయచేసి వాదనకు దిగరు అని ఆశిస్తున్నాను.
✍️ నాగరాజు యాదవ్,
మాచర్ల నియోజకవర్గం