ఫొటోలో మీరు చూస్తున్న ఈ కండలవీరుడు ఎవరో తెలుసా? మొన్న వార్తల్లోకి వచ్చిన ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్వర్ మాత్రం కాదు. ఈయనా కండలవీరుడే. పేరు డాక్టర్ ఇబుంచా. మణిపూర్ రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ఆ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఇబుంచా పేరు వింటే చాలు. పొలిటికల్ లీడర్లకు, మాఫియా ముఠాలకు, రౌడీ గ్యాంగులకు హడల్. అక్షారాల రూ. 130 కోట్ల బ్రౌన్ షుగర్ పట్టుకుని మాదక ద్రవ్యాల రవాణా మాఫియాను వణికించి మరీ కటకటాల్లోకి నెట్టిన చరిత్ర ఓ ఉదాహరణ మాత్రమే.
ఇప్పుడీ ఐపీఎస్ అధికారి గురించి ప్రత్యేక ప్రస్తావన దేనికంటే… బాడీ బిల్డింగ్ అంటే డాక్టర్ ఇబుంచాకు ఎనలేని ఫ్యాషన్. ఆల్ ఇండియా పోలీసు గేమ్స్, ప్రపంచ పోలీస్ పోటీల్లో తన శరీర దారుఢ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. దాదాపు ఎక్కడ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగినా అక్కడ ఇబుంచా వాలిపోతుంటారు. నిరుడు రాజస్థాన్ లో జరిగిన పోటీల్లోనూ ఈయన పాల్గొన్నారు. బాడీ బిల్డింగ్ లో మిస్టర్ యూనివర్స్, పద్మశ్రీ, అర్జున్ అవార్డుల గ్రహీత ప్రేమ్ చంద్ డేగ్రాతోనూ డాక్టర్ ఇబుంచాకు అనుబంధం ఉంది.
అంతేకాదు ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కోశాధికారి, ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ తో కూడా డాక్టర్ ఇబుంచాకు విడదీయరాని అనుబంధం ఉంది. విశేషమేమిటంటే తెలంగాణా రాష్ట్రం, ఖమ్మం జిల్లాతోనూ ఆయనకు సంబంధాలున్నాయి. బాడీ బిల్డింగ్ కు సంబంధించిన ఎక్విప్ మెంట్ ను డాక్టర్ ఇబుంచా ఖమ్మంలోని హెల్త్ లైన్ జిమ్ కంపెనీ నుంచే కొనుగోలు చేస్తుంటారు. శరీర దారుఢ్యం, దాని ఆవశ్యకత అంశంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల మక్కువను ఆవిష్కరించడమే ఈ విశేషాల ప్రస్తావనలోని అసలు ఆంతర్యం.